
- రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు, కుడా 10 కోట్లు మంజూరు
- చెరువుకు రెండు వైపులా నీటిపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం
- 9 అంతస్తుల్లో రాజగోపురాలు నిర్మించాలని ప్లాన్
- ఇప్పటికే శంకుస్థాపన పూర్తి.. 10 రోజుల్లో పనులు మొదలు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు, చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ మాడ వీధులు, నాలుగు వైపులా ఎత్తైన రాజగోపురాల నిర్మాణానికి సంబంధించిన పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ నెల 5న మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, వారం రోజుల్లో టెండర్ప్రక్రియను పూర్తిచేస్తామని అధికారులు, నాయకులు చెబుతున్నారు. మాడ వీధులు లేకపోవడంతో ఏటా బ్రహ్మోత్సవాలు, శాకాంబరి నవరాత్రి ఉత్సవాల టైంలో రథయాత్రను ఆలయం లోపలే నిర్వహిస్తున్నారు. తిరుమలలో మాదిరిగా ఇక్కడి ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు చేస్తుండగా ఇప్పటికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 కోట్లు, కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ(కుడా) నుంచి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. టెండర్లు అయిపోగానే పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. మాడ వీధులు, రాజగోపురాలు ఎలా ఉండనున్నాయో తెలిపేలా అధికారులు రిలీజ్ చేసిన యానిమేటెడ్ఫొటోలు, వీడియోలు ఆకట్టుకుంటున్నాయి.
60 అడుగు వెడల్పుతో బ్రిడ్జి
ప్రస్తుతం భద్రకాళి ఆలయం చుట్టూ ఒక వైపు మాత్రమే రోడ్డు ఉంది. రెండు వైపులా చెరువు, మరోవైపు ఎత్తైన గుట్ట ఉంది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయం చుట్టూరా ప్రాకారం ఏర్పాటు చేసి రథయాత్ర నిర్వహించేలా నాలుగు వైపులా రోడ్లు వేయాల్సి ఉంది. ఇందుకోసం చెరువులో దాదాపు 60 అడుగుల వెడల్పుతో రెండు వైపులా బ్రిడ్జి నిర్మించి, దానిపై 30 అడుగుల మేర రోడ్డు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి వేద పాఠశాల మీదుగా కాపువాడ నుంచి వచ్చే మెయిన్ రోడ్డుకు మాడ వీధులను కలుపుతామని అంటున్నారు. మామూలు రోజుల్లో జనాలు, వాహనాలు తిరిగేలా, ఉత్సవాల సమయాల్లో సంప్రోక్షణ చేసి కేవలం అమ్మవారి రథయాత్ర జరిగేలా చూస్తారని తెలుస్తోంది.
యాదాద్రి కంటే.. పెద్ద రాజగోపురాలు
మాడవీధులు, రాజగోపురాల నిర్మాణాల్లో కాకతీయుల శిల్ప కళ ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గోపురాలు కంచి కామాక్షి, యాదాద్రి టెంపుల్ కంటే పెద్దవిగా ఉండనున్నాయి. అక్కడ 7 అంతస్తుల్లో రాజగోపురాలు నిర్మించగా భద్రకాళి ఆలయానికి 9 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం 9 అడుగులు ఉన్న నేపథ్యంలో 9 అంతస్తుల్లో నాలుగు వైపులా రాజగోపురాలు ఉండేలా ప్లాన్చేశారు. ఈ పనులు పూర్తయితే పద్మాక్షి గుట్టవైపు ఉండేది ప్రధాన రాజగోపురం అవుతుంది.
మరో రూ.50 కోట్లు అవసరం?
మాడ వీధుల నిర్మాణం, రాజగోపురాల నిర్మాణానికి మొత్తంగా రూ.30 కోట్లు మంజూరైనట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెబుతున్నా.. పనులు పూర్తయ్యేసరికి ఖర్చు రెండింతలు పెరిగే అవకాశాలున్నాయి. చెరువు మీదుగా కేవలం మాడవీధుల నిర్మాణానికే రూ.30 కోట్లు వరకు ఖర్చు అవనున్నట్లు అంచనా వేస్తున్నారు. 9 అంతస్తుల్లో నిర్మంచే ఒక్కో రాజగోపురానికి రూ.10 కోట్లు వరకు ఖర్చు అవనుంది. కంచి, మహాబలిపురం టెంపుల్స్గోపురాలను నిర్మించిన, అనుభవజ్ఞులైన స్తపతులకు పనులను ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా నేల, వాతావరణం, ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
6 నెలల్లో పూర్తి చేస్తం
ఆరు నెలల్లో భద్రకాళి ఆలయ మాఢ వీధులు, రాజగోపురాల నిర్మాణం పూర్తయ్యేలా ప్లాన్చేస్తున్నాం. అన్ని శాఖల అధికారులు, ఇంజినీర్లు, స్తపతులను సమన్వయం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కుడా నుంచి మొత్తంగా రూ.30 కోట్లు మంజూరయ్యాయి. నిధుల సమస్య లేదు. టెంపుల్ టూరిజం కాన్సెప్ట్‌తో స్పిర్చువల్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నాం.
–దాస్యం వినయ్‍భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్
వారంలో టెండర్లు క్లియర్ చేస్తం
భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ మాఢ వీధులు, రాజ గోపురాల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేస్తాం. ఆ వెంటనే పనులు మొదలవుతాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన, ఆలయ నిర్మాణాల్లో ప్రావీణ్యం ఉన్న స్తపతుల పర్యవేక్షణలో పనులు చేయిస్తాం. ప్రకృతి సిద్ధమైన కొండలు, చెరువుల మధ్య ఉండే అమ్మవారి ఆలయం భవిష్యత్‌లో ఆధ్యాత్మికంతోపాటు పర్యాటక కేంద్రం కానుంది.
–శేషు భారతి, ఈఓ, భద్రకాళి ఆలయం