- ఈ స్థలాల విలువ రూ. 870 కోట్లకుపైనే
- జూన్ 30న రహస్యంగా జీవో జారీ చేసిన సర్కారు
- వెంటనే అప్పగించాలని రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశం
- బీసీల ఆత్మగౌరవ భవనాలకు కొండలు, గుట్టల్లో భూములు
- కొన్ని కులాల భవనాలకు పోజిషన్ కూడా చూపలే
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన హైటెక్ సిటీ సమీపంలో కమ్మ, వెలమ కుల సంఘాల భవనాలకు ప్రభుత్వం పదెకరాల భూమి కేటాయించింది. దీనికి సంబంధించి జూన్ 30న రహస్యంగా జీవోను విడుదల చేసింది. ఈ మొత్తం భూముల విలువ రూ. 870 కోట్ల దాకా ఉంటుంది. కమ్మ, వెలమలకు సిటీ నడిబొడ్డున ఇచ్చి బీసీ కులాలకు మాత్రం సిటీ శివార్లలో కొండలు, గుట్టల్లో అగ్గువ స్థలాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
అక్కడ గజం రూ. లక్షా 80 వేలు
కమ్మవారి సేవా సంఘ సమాఖ్యకు 5 ఎకరాలు, ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు 5 ఎకరాల భూమిని సర్కారు కేటాయించింది. ఖానామెట్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెం.41/14 లో ఈ భూములున్నాయి. కమ్మ, వెలమ కమ్యూనిటీ భవనాలు, ఇతర అవసరాల నిర్మాణాల కోసం ఆయా కులాల ప్రతినిధులకు ఈ భూమిని వెంటనే అప్పగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కమ్మ కులస్తులకు హైటెక్ సిటీ రోడ్డుకు సమీపంలో అయ్యప్ప సొసైటీకి వెళ్లే రోడ్డును ఆనుకొని, వెలమలకు ఎన్ఏసీ రోడ్డుకు ఆనుకొని భూములు కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలోనే ఇది కాస్ట్లీ ఏరియా. ఇక్కడ గజం జాగ రేటు రూ. లక్షా 80 వేల దాకా ఉంది. అంటే ఒక్కో ఎకరం రూ. 87 కోట్లకుపైనే పలుకుతోంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం వెలమ, కమ్మ కులాలకు కేటాయించిన మొత్తం పదెకరాల స్థలం విలువ రూ. 870 కోట్లకుపైనే. రాష్ట్ర ప్రభుత్వం 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో కమ్మ, వెలమల జనాభా కేవలం 0.1 శాతం లోపలే ఉంది. ఆ రెండు కులాలకే ఖరీదైన స్థలం కేటాయించారు.
కమ్మ కులస్తులకు ‘గ్రేటర్’ బొనాంజా
టీఆర్‌ఎస్ సర్కారు అత్యంత ఖరీదైన స్థలాన్ని తమ సొంత కులానికి ఇచ్చుకుందనే అభిప్రాయాలున్నాయి. వెలమల కంటే తక్కువ జనాభా ఉన్న కమ్మ కులానికి అదే స్థాయిలో ఖరీదైన భూములను ఇవ్వడం చర్చకు తెరలేపింది. గ్రేటర్ ఎలక్షన్ టైమ్‌లో హైదరాబాద్‌లోని కమ్మ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్.. అక్కడ కుల ప్రతినిధులతో ముందస్తుగా ఒప్పందం చేసుకుందనే ప్రచారం జరిగింది. అందులో భాగంగానే భూముల కేటాయింపు జరిగిందనే విమర్శలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ కుల ప్రతినిధులు చేసిన అభ్యర్థన మేరకే ఇప్పుడీ స్థలాన్ని కేటాయించినట్లు జీవోలో ప్రస్తావించటం గమనార్హం.
బీసీలకు కొండలు, గుట్టల్లో..
బీసీలకు సిటీకి దూరంగా అగ్గువ భూములు కేటాయించటం, అదీ తక్కువ స్థలం ఇచ్చి చేతులు దులుపుకోవటం.. ఇప్పుడు రహస్యంగా కమ్మ, వెలమలకు అంతకు వంద రెట్ల విలువైన భూములను సిటీ నడిబొడ్డున ఇవ్వటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందే బీసీ వర్గానికి చెందిన 36 కులాలకు ల్యాండ్ కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఆ తర్వాత మరో 4 కులాలతో కలిపి మొత్తం 82 ఎకరాలు ఇచ్చింది. విశ్వబ్రాహ్మణ, మున్నూరు కాపు, తెలంగాణ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ (గౌడ్), ముదిరాజ్ కులాలకు 5 ఎకరాల చొప్పున అలకేట్ చేసింది. శాలివాహన (కుమ్మరి), గంగపుత్ర కులాలకు 3 ఎకరాల చొప్పున.. పెరిక, సగర/ఉప్పర, దూదేకుల, నాయీబ్రాహ్మణ కులాలకు రెండెకరాల చొప్పున కేటాయించింది. దేవాంగ, పట్కర్ కులాలకు 30 గుంటల చొప్పున.. లోధ్, భట్రాజు, రంగరేజ్/భవసార క్షత్రియ కులాలకు 20 గుంటల చొప్పున.. భుంజ్వ, జాండ్ర, నీలికుల కులాలకు 10 గుంటల చొప్పున స్థలమే కేటాయించింది. భవనాల కోసం ఔటర్ రింగ్ రోడ్డు, ఉప్పల్ భగాయత్, కోకాపేట్, మేడిపల్లి, ఫీర్జాదిగూడతోపాటు కోకాపేట దగ్గరలో గుట్టలు, కొండల్లోనూ ల్యాండ్ ఇచ్చారు. కొన్ని స్థలాలైతే ఎక్కడున్నాయో తెలియదు. ఉప్పల్ భగాయత్ దగ్గర మూసీ పక్కన కూడా భూములిచ్చారు.
బీసీ భవనాల కోసం నయా పైసా ఖర్చు చేయలే
బీసీ కులాల ఆత్మ గౌరవ భవనాలపై జీవోలు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. జీవోలు రిలీజ్ చేసి మూడేండ్లు దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటి దాకా ఆయా స్థలాల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. కోకాపేటలో ఇంకా గుట్టలు, భూమి చదును పనులు పూర్తి కాలేదు. ముదిరాజ్ భవన్ మినహా ఏ ఒక్క దానికీ శంకుస్థాపన చేయలేదు. వీటి నిర్మాణాలకు రూ. 90 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ ఇందులో ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలేదు. ఇక ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన భూములను పట్టించుకోకపోవడంతో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి దర్శనమిస్తున్నాయి. సగర సంఘం భవన స్థలాన్ని క్రిస్టియన్లకు కేటాయించడంతో వివాదం నడుస్తోంది.
‘‘రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రతి కులానికి హైదరాబాద్ లో ప్రభుత్వమే భవనాలు నిర్మిస్తుంది. దాదాపు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల ఖర్చుతో సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తం. సంచార ఆత్మగౌరవ భవన్ అనేది పేదలు పెండ్లిళ్లు చేసుకోవడంతో పాటు విద్య, సాంస్కృతిక వికాస కేంద్రంగా భాసిల్లుతుంది.’’
‑2018 ఆగస్టు 25 కేసీఆర్ చెప్పిన మాటలివి
బీసీలపై ముమ్మాటికీ వివక్షే
తెలంగాణ ఉద్యమంలో బీసీలది కీలక పాత్ర. కేసీఆర్ బీసీలకు చేసిన అన్యాయం ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఏడేండ్లుగా టీఆర్‌ఎస్ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది. ఆత్మగౌవర భవనాల పేరుతో ఇచ్చిన మాటపై నిలబడలేదు. భవనాల నిర్మాణానికి ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. వెలమలు, కమ్మలకు ఖరీదైన భూములు ఇచ్చి బీసీలకు సిటీకి దూరంగా, తక్కువ రేటున్న భూములను ఇవ్వడం ముమ్మాటికీ వివక్షే.
‑ ఉప్పరి శేఖర్ సాగర్, తెలంగాణ సగర సంఘం, ప్రెసిడెంట్
బీసీలకు కొండలు, గుట్టల్లోనా..?
వెలమలు, కమ్మలకు అల్రెడీ బిల్డింగ్స్, ఆస్తులున్నాయి. వాళ్లకు స్థలాలెందుకు? బీసీ హాస్టళ్లు, 290 బీసీ గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఒక్క సొంత భవనమూ లేదు. బీసీ ఆత్మ గౌరవ భవనాల పేరుతో గుట్టలు, కొండల్లో స్థలాలిచ్చారు. వెలమలు, కమ్మలకు హైటెక్ సిటీలో ఇవ్వడం సరికాదు.
- ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ప్రెసిడెంట్
బీసీలు ఎప్పటికీ ఇట్లనే ఉండాల్నా?
బీసీ ఆత్మగౌరవ భవనాల పేరుతో వంచిస్తున్నరు. నగరం నడిబొడ్డున అగ్రకులం వాళ్లకు ఇచ్చి.. బీసీలకు సిటీ బయట చౌక భూములు ఇవ్వడం ఏంది? బీసీలు ఎప్పటికీ ఇట్లనే ఉండాల్నా? ఇట్లనే వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
- కొట్టాల యాదగిరి, తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం, జనరల్ సెక్రటరీ