గత ప్రభుత్వ హయాంలో నియమించిన వీసీల పాలన కాలం ఇంకా మూడు నెలలు మాత్రమే ఉండడం, వీసీల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేసిన ఆరు కేసులు కూడా ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడం, అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి, ఉద్యోగుల సమస్యలు ఎక్కడికక్కడే ఉండడం, చివరి రోజుల్లో యూనివర్సిటీల్లో అవినీతి దాడులు జరగడం కలపోతగా.. ప్రస్తుతం జరగబోతున్న వీసీల నియామకాల పట్ల యూనివర్సిటీ విద్యార్ధి, ఉద్యోగ వర్గాల్లో ఒక ఉత్కంఠ నెలకొంది.
గత ప్రభుత్వం ఆయా యూనివర్సిటీలకు నియమించిన వీసీలపై అనేక రకాల ఆరోపణలు రావడంతో ఇటీవల వచ్చిన కొత్త ప్రభుత్వం వేగంగా యూనివర్సిటీలను ప్రక్షాళన చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ప్రస్తుత వీసీల పదవీ కాలం ముగిసిన తర్వాత ఇంచార్జి వీసీల పాలన అవసరం లేకుండా కొత్త వీసీలను వెంటనే నియమించడానికి చర్యలు చేపట్టింది. అన్ని యూనివర్సిటీలకు వీసీల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం, సెర్చి కమిటీలకు ఆయా యూనివర్సిటీల పాలక మండలి సమావేశాలు నిర్వహించడం చకచకా జరిగిపోయాయి. చివరి తేదీ నాటికి రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకుగాను వీసీల కోసం మొత్తం 1,382 దరఖాస్తులు వచ్చాయి. సెర్చ్‌కమిటీలు వేసి, దరఖాస్తులను పరిశీలించి పేర్లను ప్రభుత్వానికి పంపి ఆ తర్వాత గవర్నర్ ద్వారా ఆమోదింపచేసుకోవాల్సి ఉంటుంది.
గతంలో వీసీల నియామకంపై 6 కేసులు
గత ప్రభుత్వం మూడేండ్ల కిందట నియమించిన వీసీల నియామకాలు చెల్లవని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.మనోహర్ రావు రెండేండ్ల కిందట హైకోర్టులో కేసు వేశారు. ప్రొఫెసర్‌గా పది సంవత్సరాలు అనుభవం లేనివారిని, 70 సంవత్సరాలు దాటినవారిని వీసీలుగా నియమించారని అఫిడవిట్ వేశారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ.తాటికొండ రమేష్‌కు ప్రొఫెసర్‌గా పది ఏండ్ల అనుభవం లేదని ఆయన నియామకం చెల్లదని నిజామాబాద్‌కు చెందిన విశ్రాంత ప్రిన్సిపాల్ విద్యాసాగర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
జేఎన్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. ప్రదీప్ కుమార్, ఆ యూనివర్సిటీ ఉప కులపతి నియామకాన్ని తప్పుపడుతూ 2022 జూన్ నెలలో హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా. కరుణాకర్ రెడ్డి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వీసీగా నియామకం అయిన ప్రొ. సిఎచ్. గోపాల్ రెడ్డి నియామకంపై ఆదే సంవత్సరం కేసు దాఖలు చేశారు. 2022 మార్చి నెలలో జేఎన్టీయూ వీసీగా నియమించిన ప్రొ.కె. నరసింహ రెడ్డి నియామకంపై ఎన్.ఎస్.యూ.ఐ విద్యార్ధి సంఘం కేసు దాఖలు చేసింది. ఏబీవీపీ కూడా అదే యూనివర్సిటీ వీసీ నియామకంపై కోర్టులో కేసు దాఖలు చేసింది.
విద్యార్థుల ఫీడ్ బ్యాక్, ఆడిట్ రిపోర్టులతో వీసీ దరఖాస్తుల స్క్రూటినీ జరగాలి
గత ప్రభుత్వం నియమించిన వీసీల పరిపాలనలో యూనివర్సిటీలు పూర్తిగా భ్రష్టు పట్టాయని, అనేక మంది వీసీలపై అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నా కూడా వారితో పాటు ఆయా యూనివర్సిటీల్లో రిటైర్ అయిన ప్రొఫెసర్లు కూడా వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో పనిచేసిన వారి, ప్రస్తుతం పని చేస్తున్నవారి పాలనా దక్షతను చూడడానికి విద్యార్థుల నుంచి, పరిశోధక విద్యార్థుల నుంచి, టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. వారి పాలన కాలం నాటి స్టేట్ ఆడిట్ రిపోర్టులను కూడా పరిశీలించి వారి అప్లికేషన్లను స్క్రూటినీ చేస్తే అవినీతి మరకలు ఉన్నవారిని మొదటి దశలోనే
తొలగించవచ్చు . యూజీసీ నిబంధనల్లో మంచి అకడెమిక్ మెరిట్ ఉన్నవారిని వీసీగా నియమించాలని పేర్కొన్నా .. గత ప్రభుత్వం అలాంటివేమీ పాటించలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితికి తావివ్వకుండా ఈ ప్రభుత్వం వీసీల ఎన్నిక చేపట్టాలి.
నామినీ ప్రతిపాదనలపై అపోహలు
సెర్చ్‌కమిటీలో యూనివర్సిటీ నామినీల కోసం ఇటీవల అన్ని యూనివర్సిటీల పాలకమండళ్లతో ఉన్నత విద్యాశాఖ సమావేశాలు నిర్వహించింది. అయితే వర్సిటీ వీసీల రేసులో ప్రస్తుత వీసీలు కూడా ఉన్నారు. వారు వీసీలుగా ఉన్నప్పుడే వారితో సమావేశాలు నిర్వహించి వర్సిటీ నామినీని తీసుకోవడం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశం గామారింది. ప్రస్తుత వీసీలే పాలక మండలి సభ్యులుగా ఉండగా, వర్సిటీ నామినీని సెర్చ్ కమిటీ కోసం ఎవరు ప్రతిపాదించారనేది ప్రశ్న.
సెర్చ్‌కమిటీలో వర్సిటీ నామినీ పేరు ప్రస్తుత దరఖాస్తు దారులకు తెలువకుండా ఉంటుందా లాంటి ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఉన్నత విద్యాశాఖ వర్సిటీ నామినీని ఎన్నిక చేస్తే ఏ ప్రాతిపాదికన ఈ ఎన్నిక జరుగుతుందనేది వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈ అపోహలకు ఉన్నత విద్యాశాఖ తెరదించి మళ్ళీ నియామక ప్రక్రియపై ఎటువంటి కేసులు వేసే ఆస్కారం ఇవ్వకుండా చూడాలి.విశ్వవిద్యాలయాల్లో పాలన సజావుగా జరగాలంటే రాజకీయ జోక్యం లేకుండా పూర్తిగా అకడిమిక్ హై ప్రొఫైల్ ఉన్నవారినే వీసీలుగా నియమించాలి.
పెరుగుతున్న వీసీల అక్రమాలు
కొన్ని కేసుల్లో హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినా వర్సిటీల వీసీలు మాత్రం వాటిని అమలుపరచక పోవడంతో కోర్టు ధిక్కరణ నేరం కింద కూడా యూనివర్సిటీల మీద కేసులు పరిపాటి అయ్యాయి. యూనివర్సిటీలలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న వీసీల పట్ల అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించడం, బదిలీలు చేయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వ్యక్తగత కుట్రలు పన్నడం లాంటి పనులకు వీసీలు దిగజారారు. అందువల్ల హైకోర్టు జడ్జిమెంట్ కోసం వేచి చూస్తూ నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇప్పటి వరకు వీసీ కేసుల పట్ల హైకోర్టు తేల్చకపోవడంతో వర్సిటీల్లో వీసీల అక్రమాలు ఇంకా పెరిగిపోయాయి.
జడ్జిమెంట్లకు నోచుకోని వీసీల కేసులు
గతంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ నియామకానికి సంబంధించిన కేసులో వాదనలు పూర్తయి జడ్జిమెంట్‌ను జస్టిస్ కే.లక్ష్మణ్ ధర్మాసనం రిజర్వు చేసినప్పటికీ 9 నెలల వరకు జడ్జిమెంట్ రాలేదు. ఈ కారణంగా అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదులు వెళ్ళడంతో ఆ కేసుకు సంబంధించిన న్యాయవాదిని మార్చి వేరే కోర్టుకు కేసును బదిలీ చేశారు. మళ్ళీ ఆ కోర్టులో కూడా వాదనలు పూర్తి అయ్యాయి. మొత్తం ఆరు కేసులు కూడా ఒకే కోర్టులో (ప్రొ. విజయసేన్ రెడ్డి ధర్మాసనం) ఉండడంతో ప్రస్తుతం ఈ కేసులు కనీసం లిస్టు కావడానికి కూడా నోచుకోవడం లేదు. యూనివర్సిటీల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ మూడేండ్లలో జరిగిన అన్యాయం కారణంగా ఆయా యూనివర్సిటీలపైన మొత్తం వందకు పైగా కేసులు హైకోర్టులో నమోదు అయ్యాయి అంటే ఆయా యూనివర్సిటీల్లో ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది.
- డా. మామిడాల ఇస్తారి,అసోసియేట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ