గ్రేటర్ హైదరాబాద్ లోని కంటెయిన్ మెంట్ జోన్స్ కు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే గుర్తించిన కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏరియాలు సిటీలో 240 వరకూ ఉండగా.. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో.. మరికొన్ని ఏరియాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తుంది సర్కార్. దీనితో కంటెయిన్ మెంట్ జోన్లల్లో చేపట్టాల్సిన చర్యలపై గైడ్ లైన్స్ విడుదల చేసింది.
కంటెయిన్ మెంట్ జోన్ గా గుర్తించిన ప్రతీ ప్రాంతంలో ఇక నుండి కఠినంగా వ్యవహరించనున్నారు. పూర్తిగా ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ మూసివేయడంతోపాటు 8 ఫీట్ల ఎత్తు వున్న భారికేట్లు ఏర్పాటు చేస్తారు. కంటెయిన్ మెంట్ జోన్ ప్రాంతంలోని ప్రజలను బయటికి రాకుండా, బయటి వారిని లోపలి రాకుండా చేస్తారు. 24 గంటల పాటు ఆ ప్రాంతం పై పోలీస్ ల నిఘా ఉంటుంది. సీసీ కెమెరాల తో వాచ్ చేస్తారు. కంటెయిన్ మెంట్ జోన్స్ పరిధిలో వున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా అధికారులే పంపిణీ చేయనున్నారు. వారికీ కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసి ఇవ్వనున్నారు.
ఇక కంటెయిన్ మెంట్ జోన్ పరిధిలో వృద్దులు , వికలాంగులు ఉంటే.. వారికీ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఫుడ్ పంపిణీ చేయాలి.
ఇల్లు లేని నిరాశ్రులు, ఇతర రాష్ట్రాల కార్మికులు, ఫుట్ పాత్ లపై వున్న బిచ్చగాళ్ళు ఎవరైన వున్నా వారిని సిటీలో వున్న జీహెచ్ఎంసీ షెల్టర్లకు షిఫ్ట్ చేయాలి. అదేవిదంగా గత రెండు మూడు నెలలుగా ఇతర దేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి హోమ్ క్వారైటైన్ లో ఉండేలా చూడాలి. కరోనా లక్షణాలు వున్న వారిని హెల్త్ అధికారులు గుర్తించి వెంటనే.. హోమ్ క్వారైటైన్ లేదా హాస్పిటల్ కు తరలించాలి.
గ్రేటర్ పరిధిలోని జోనల్, సర్కిల్ స్థాయిలో ఏర్పాటు చేసిన సర్వేలైన్స్ బృందాలు 24 గంటలు పనిచేయనున్నాయి. ఈ టీం లో పోలీస్ అధికారులతోపాటు మున్సిపల్ , హెల్త్ అధికారులు వుంటారు. ఎమర్జెన్సీ మెడికల్, అంబులెన్సు సర్వీసులు తప్పా ఇతర వాహనాలకు అనుమతులు వుండవు. అంతేకాదు.. కంటెయిన్ మెంట్ జోన్స్ పరిధిలో ప్రజలకు కరోనా వైరస్ పై అవేర్నెస్ కల్పించాల్సి ఉందని సర్కార్ ఉత్తర్వులో చెప్పింది. తప్పని సరిగా ప్రతిఒక్కరు మాస్కులు, శానిటైజర్లు వాడడంతోపాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించింది.
కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ప్రజలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు , ఫ్లెక్సిలు ఏర్పాటు చేయడంతోపాటు.. వాటిల్లో పోలీస్ , మున్సిపల్ , హెల్త్ అధికారుల ఫోన్ నంబర్లు కూడా ఉండేలా చూడాలని చెప్పింది సర్కార్. ఇలా కఠినంగా వ్యవహరించడం వల్ల కంటెయిన్ మెంట్ జోన్స్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గించవచ్చని భావిస్తుంది రాష్ట్ర సర్కార్.