హైదరాబాద్ లో కలకలం సృష్టించిన అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటికే ఆస్పత్రిని సీజ్ చేసిన ప్రభుత్వం ఇవాళ నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అలకానంద హాస్పిటల్ ని పరిశీలించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
సరూర్ నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్ లో పర్మిషన్లు లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని, ఒక్కో కిడ్నీని రూ. 55 లక్షలకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది. జనవరి 21న ఆస్పత్రిపై అధికారులు దాడులు చేపట్టడంతో పేషెంట్లను అక్కడే వదిలేసి డాక్టర్లు పరారయ్యారు.
అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సుమంత్ ను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి, పోలీసులను చూసి పరారైన డాక్టర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్న ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు వెల్లడించారు. పరారైన వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు డీసీపీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
ఒక్కో కిడ్నీ రూ.55 లక్షలు..
తమిళనాడుకు చెందిన ప్రైవేట్డాక్టర్ పవన్, ప్రదీప్ అనే వ్యక్తిని మధ్యవర్తులుగా పెట్టుకుని ఈ కిడ్నీ దందా కొనసాగించినట్టు అధికారులు గుర్తించారు. రూ. 55 లక్షలకు బేరం కుదుర్చుకుని ఒక్కో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 17న నస్రీన్ బాను నుంచి కిడ్నీ సేకరించి.. కిడ్నీ రిసీవర్‌కు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినట్లు జిల్లా వైద్య అధికారులు గుర్తించారు.