- జనగామ అగ్రికల్చర్ మార్కెట్‌లో ఆగని ట్రేడర్ల దోపిడీ
- మద్దతు ధర కంటే రూ. 500 నుంచి రూ. 600 తక్కువకు కొనుగోలు
- ఆందోళనకు దిగిన రైతులు, ఆగ్రహించిన అడిషనల్ కలెక్టర్
- గురువారానికి రూ. 30 పెంచిన ట్రేడర్లు
- ముగ్గురు వ్యాపారులపై కేసు, మార్కెట్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్
- మార్కెట్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభం
జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్‌లో ట్రేడర్ల దోపిడీ ఆగడం లేదు. వడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగినా, ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేసినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. మద్దతు ధర చెల్లించాలని ఆఫీసర్లు ఆదేశించినా పట్టించుకోకపోవడంతో ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేయించారు. అంతేకాకుండా మార్కెట్ యార్డులో సర్కారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
ముగ్గురు ట్రేడర్లపై కేసు
మార్కెట్ యార్డులో ట్రేడర్ల దోపిడీపై అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. తక్కువ ధర ఇస్తూ రైతులను మోసం చేస్తున్న ట్రేడర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో డీఎంవో నరేంద్ర గురువారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఎన్ ట్రేడర్స్ కందుకూరి వెంకట్‌నారాయణ, ఉమా ట్రేడర్స్ దాస ఉషారాణి, పరమేశ్వర ట్రేడర్స్ కందుకూరి సుజాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ సెక్రటరీ భాస్కర్‌ను సస్పెండ్ చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో భాస్కర్‌కు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. సెక్రటరీ ఇచ్చే వివరణ ఆధారంగా సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకుంటామని డీఎంవో నరేంద్ర
చెప్పారు.
మార్కెట్‌లో సర్కార్ కొనుగోలు కేంద్రం
అడిషనల్ కలెక్టర్ ఆదేశాలతో ట్రేడర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జనగామ అగ్రికల్చర్ మార్కెట్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి గురువారం సివిల్ సప్లై ఆఫీసర్ రోజారాణి, డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రసాద్, డీఎంవో నరేంద్ర ప్రారంభించారు. దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ సెంటర్‌లోనే వడ్లు అమ్ముకొని మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. సెలవు రోజుల్లో కూడా సెంటర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీసీవో అనిల్‌కుమార్, డీసీవో రాజేందర్, అగ్రికల్చర్ ఆఫీసర్ వినోద్‌కుమార్, మార్కెట్ సెక్రటరీ భాస్కర్ పాల్గొన్నారు.
రూ. 500 నుంచి రూ. 600 తక్కువకు కొనుగోలు
యాసంగి వడ్ల కొనుగోళ్ల కోసం జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 195 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో కాంటాలు లేట్ అవుతుండడంతో రైతులు జనగామలోని అగ్రికల్చర్ మార్కెట్‌కు వడ్లను తరలించి ప్రైవేట్ ట్రేడర్లకు అమ్ముతున్నారు. నిత్యం వేలాది బస్తాల వడ్లు మార్కెట్‌కు వస్తుండడంతో ట్రేడర్లు ధరను అమాంతం తగ్గించేశారు. సర్కారు మద్దతు ధర ఏ1 రకానికి క్వింటాల్‌కు రూ.2,203, కామన్ రకం రూ.2,183 ఉండగా ట్రేడర్లు ఏకంగా రూ.500ల నుంచి రూ. 600లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. బుధవారం క్వింటాల్‌కు రూ. 1,550 నుంచి రూ.1,859 మాత్రమే చెల్లించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ట్రేడర్లు గురువారం మరో రూ.30 పెంచి వడ్లను కొనుగోలు చేశారు.