యాసంగికి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్​ కోసం గోదావరి నీటి ఎత్తిపోతలు షురూ చేశారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, లక్ష్మీపూర్​పంపుహౌసుల్లో ఒక్కో మోటారు ఆన్​చేసి నీటిని పంప్ ​చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్​–1లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలతో వాటిలో నిల్వ ఉంచిన నీటిని కిందకు(నదిలోకి) వదిలేశారు. సుందిళ్ల బ్యారేజీలోనూ నీటిని ఖాళీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి 12 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో ఆ నీటిని గేట్ల నుంచి కిందికి వదిలేస్తున్నారు. యాసంగి సీజన్​లో ఎల్ఎండీ దిగువన ఉన్న ఎస్సారెస్పీ ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ స్టేజీ –2 ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ఎల్లంపల్లి నీటిని తరలిస్తున్నారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీలకు బుధవారం సాయంత్రానికి 17.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో 3,567 క్యూసెక్కుల నీటిని నందిమేడారం, లక్ష్మీపూర్​ల మీదుగా మిడ్​మానేరుకు తరలిస్తున్నారు.  వీటికి తోడు ఎల్లంపల్లి నుంచి ఆరు టీఎంసీల వరకు లిఫ్ట్​చేసి ఆ నీటిని ఎల్ఎండీకి తరలించనున్నారు.