‘స్థానిక’ నేతల వేతన ఖర్చు రూ. 645 కోట్లు

‘స్థానిక’ నేతల వేతన ఖర్చు రూ. 645 కోట్లు
  • స్థానాల పెంపుతో ఏటా రూ.30 కోట్ల అదనపు భారం

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో పంచాయతీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు పెరిగాయి..చాలా మంది నేతలకు పదవీ యోగం కలిగే అవకాశం దక్కింది. కానీ, అదే స్థాయిలో ఖజానా పైనా భారం పడనుంది. 2015లో స్థానిక సంస్థల నేతలకు ప్రభుత్వం జీతాలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాలు, కొత్త జడ్పీటీసీలు, కొత్త మండలాలు, పంచాయతీలు కలుపుకుంటే.. స్థానిక నేతల వేతనానికే ఏటా రూ. 129 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. వారి పదవీ కాలం పూర్తయ్యే నాటికి వాళ్లకయ్యే ఖర్చు రూ.645 కోట్లు అవుతుంది.

32 మంది జడ్పీ చైర్మన్లకు నెలకు లక్ష చొప్పున ఏటా రూ. 3.84 కోట్లు , 535 మంది జడ్పీటీసీ, ఎంపీపీలకు 10 వేల చొప్పున ఏటా  రూ.12.84 కోట్లు ,5,984 మం ది ఎంపీటీసీలకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.35.90 కోట్లు, 12,751 మంది సర్పంచులకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.76.50 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా స్థానాల పెంపుతో ఏటా ఖజానాపై రూ.30 కోట్ల అదనపు భారం పడనుంది.

వాళ్ల పదవీ కాలం మొత్తంలో ఇచ్చే వేతనం.. గతంతో పోలిస్తే 25 శాతం ఎక్కువ. గతంలో జడ్పీల విస్తీర్ణం పెద్దగా ఉండడంతో చైర్మన్ల జీతాన్ని ప్రభుత్వం లక్షకు పెం చింది. ఇప్పుడు 9 జడ్పీలు 32 జడ్పీలకు పెరగడం, కొన్ని నాలుగైదు మండలాలతోనే ఏర్పడిన నేపథ్యం లో ఆ పెంచిన జీతాన్నే ఇస్తారా లేదంటే తగ్గిస్తారా అన్న చర్చ సాగుతోంది.