
హైదరాబాద్, వెలుగు: 700 మంది స్టూడెంట్లకు ఒకే టాయిలెట్ ఉందని ఒక ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర్టు పిల్‌గా తీసుకుంది. సరూర్‌నగర్ ప్రభుత్వ జానియర్ కాలేజీలో 700 మందికి ఒకే టాయిలెట్ ఉందనే స్టోరీని లా స్టూడెంట్ మణిదీప్.. హైకోర్టుకు పంపడంతో పిల్‌గా పరిగణించి విచారించింది. మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే డివిజన్ బెంచ్ విచారణ సమయంలో గత ఉత్తర్వుల అమలు గురించి ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించింది.
ప్రభుత్వం మారిన కారణంగా కొంత సమయం ఇవ్వాలని లాయర్ కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ మార్పునకు కాలేజీల్లో టాయిలెట్ల నిర్మాణానికి సంబంధం ఏంటని ప్రశ్నించిం ది. అన్నింటికీ ప్రభుత్వం మారిందని చెప్పడం సరికాదని చెప్పింది. తదుపరి విచారణ సమయానికి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది.