టీఎస్ ఐ సెట్- 2023 ఫలితాలు విడుదలైయ్యాయి. వరంగల్ జిల్లా కాకతీయ యునివర్సీటీలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. తొలి మూడు ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. నూకల శరణ్ కుమార్ మొదటి ర్యాంకు సాధించగా.. సాయినవీన్ రెండు, రవితేజ మూడో ర్యాంకులో రాణించారు. ఐసెట్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ ను నెల రోజుల్లో విడుదల చేస్తామని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 2023 మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్ పరీక్షలు నిర్వహించారు. టీఎస్ ఐ సెట్ ఫలితాలను షెడ్యూల్ ప్రకారం జూన్ 20న విడుదల చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు పరీక్ష కన్వీనర్ ఆచార్య పి. వరలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోండి
- అభ్యర్థులు మొదటగా https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఐసెట్ ఫలితాలు - 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.