జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్

జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్

హైదరాబాద్, వెలుగు :  టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ఎగ్జామ్ ను జూన్ 3న నిర్వహిస్తామని లాసెట్  కన్వీనర్  ప్రొఫెసర్  విజయలక్ష్మి తెలిపారు. అయితే, గతంలో రెండు సెషన్లలోనే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించామని, ప్రస్తుతం మూడు సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. జూన్ 3న  ఉదయం 9 నుంచి 10.30 వరకు ఫస్ట్  సెషన్, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు సెకండ్  సెషన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపారు. ఈ రెండు సెషన్లూ మూడేండ్ల ఎల్ఎల్ బీ ఎగ్జామ్  రాసేవారికి ఉంటుందన్నారు. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్​బీ కోర్సు, ఎల్ఎల్​ఎం కోర్సు కోసం రాసే పీజీఎల్ సెట్ అభ్యర్థులకు సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కాగా, ఈ నెల 20 వరకూ రూ.2వేల ఫైన్ తో ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని, 20 నుంచి 25వ తేదీ మధ్యలో అప్లికేషన్  ఎడిట్  ఆప్షన్ ఉంటుందని వెల్లడించారు.