మునుగోడు దత్తత.. ఉత్తదే!

  • ఉప ఎన్నికలో పోటాపోటీగా దత్తత తీసుకున్న మంత్రులు
  • గెలిచినంక కనిపించని కేటీఆర్, ఎర్రబెల్లి, మల్లారెడ్డి 
  • ఫండ్స్​ లేక ఏడియాడనే నిలిచిన అభివృద్ధి పనులు
  • ఉద్యోగాలెక్కడ?  అంటూ మల్లారెడ్డిని ప్రశ్నిస్తున్న ఆరెగూడం యూత్​

నల్గొండ, వెలుగు :  ఎన్నికల్లప్పుడు మునుగోడు నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పేరుతో మురిపించిన  మంత్రులు మళ్లీ ఆ మాటెత్తడం లేదు. ఎలక్షన్ల సందర్భంగా వాళ్లిచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి.  మునుగోడును దత్తత తీసుకొని రూ.400 కోట్లతో అభివృద్ధి చేస్తానని గత డిసెంబర్ 1న  మునుగోడులో జరిగిన ఉమ్మడి  నల్గొండ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కేటీఆర్​ ప్రకటించారు.  ఆయనతో పాటు ఎన్నికల్లో ఇన్​చార్జిలుగా పనిచేసిన వివిధ శాఖల మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆఫీసర్లు ఆ మీటింగ్​లో పాల్గొన్నారు.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.1,500కోట్లతో అభివృద్ధి పనులు చేపడ్తున్నామని చెప్పి, అందులో భాగంగా మునుగోడు అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశం జరిగిన  నెల తర్వాత జనవరి 6న గట్టుప్పల్​, చండూరుకు వచ్చిన  కేటీఆర్ అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేశారు.  వీటిల్లో చండూరు మున్సిపాలిటీ  పనులకు రూ.35 కోట్లు​, కేటీఆర్​ ఇన్​చార్జిగా ఉన్న గట్టుప్పల్​ లో రూ.4 కోట్లతో  చేనేత క్లస్టర్​ నిర్మాణానికి ఫౌండేషన్  వేశారు. శిలాఫలకాలు వేసి ఆరు నెలలు గడుస్తున్నా  ఒక్క పనీ పూర్తి చేయలేదు. 

రివ్యూ  కూడా ఉత్తదే..

మునుగోడును దత్తత తీసుకున్న కేటీఆర్ ​ప్రతీ మూడు నెలలకొకసారి  నియోజకవర్గానికి  వచ్చి పనుల ప్రోగ్రెస్​ చూస్తానని చెప్పారు.  కానీ, ఆర్నెళ్లు గడుస్తున్నా  మునుగోడు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.  ఉపాధి హామీ స్కీం కింద  గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, ఎన్నికల టైంలో ఆగమేఘాల మీద మొదలుపెట్టిన పనులు మినహా ఈ ఆర్నెళ్లలో కొత్త పని ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు.  జిల్లా ఆఫీసర్లకే పనుల పర్యవేక్షణ అప్పగించి చేతులు దులుపుకున్నారు. కేటీఆర్​ పట్టించుకోకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం మొండికేశారు.  మేజర్​ పనుల్లో టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతున్నది. గ్రామాల్లో  సీసీ రోడ్లు వేసిన లోకల్​ లీడర్లకు బిల్లులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామని ఎన్నికల టైంలో చెప్పిన కేటీఆర్​ఎన్నికలయ్యాక  ఆ సంగతే మర్చిపోయారు.  అసలు మునుగోడులో  ఏం జరుగుతుందో ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్​ చైర్మన్లకు కూడా తెలియని పరిస్థితి. 

మంత్రుల కోసం ఎదురుచూపు

మునుగోడు ఉప ఎన్నిక  సందర్భంగా వివిధ ప్రాంతాలకు ఇన్​చార్జిలుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్​, సత్యవతి రాథోడ్​, మల్లారెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, ప్రశాంత్​ రెడ్డి ఉన్నారు. ఆ సందర్భంగా వారు హామీలు కూడా నెరవేరక పోవడంతో స్థానికులు గుర్రుగా ఉన్నారు.  చండూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని  హామీ ఇచ్చిన మంత్రి ఎర్రబెల్లి  ఎన్నికలయ్యాక  ఒక్కసారి కూడా రాలేదు. చండూరులో  ఏర్పాటు చేస్తామని  చెప్పిన వంద పడకల దవాఖానకు చౌటుప్పల్​లో శంకుస్థాపన చేయడంతో  ఇక్కడి జనాలు ఆగ్రహంతో ఉన్నారు. రూ.5 కోట్లతో మొదలు పెట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.  రూ. టెండర్లు పూర్తయినా  రూ.30 కోట్లతో చేపట్టాల్సిన డబుల్ రోడ్డు పనులు ప్రారంభించలేదు.   చౌటుప్పుల్ మండలంలోని ఆరెగూడెం, రెడ్డిబాయి, కాట్రేవు ఎంపీటీసీ స్థానానికి ఇన్​చార్జిగా వ్యవహరించిన మంత్రి మల్లారెడ్డి ఆరెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గౌడ, యాదవ, వడ్డెర కుల సంఘాలకు కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. 

ఇందుకోసం ఒక్కో కుల సంఘానికి రూ.2లక్షలు  అడ్వాన్స్​గా ఇచ్చిన మంత్రి..ఎన్నికలవగానే మిగిలిన డబ్బులు ఇచ్చి దగ్గరుండి కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తానని చెప్పారు. స్థానిక దివిస్ పరిశ్రమల్లో యువతకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు.  అలాగే ప్రభుత్వ గురుకులాల్లో, తన ప్రైవేట్ స్కూళ్లలో ఆరెగూడెం విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చారు.  దీంతో మంత్రి మల్లారెడ్డి  కోసం ఆరెగూడెం నిరుద్యోగులు, విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  మంత్రి గంగుల కమలాకర్ అయితే ఏకంగా నారాయణపూర్​ మండలం కొత్తపేట కాలనీలో ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇప్పిస్తానని ఆధార్​ జిరాక్స్​లు కూడా తీసుకున్నారని జనాలు చెప్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కొత్తపేట, లింగోజి గూడాల్లో ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇప్పిస్తానని  మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పిన హామీలన్నీ గాలికే పోయాయి. 

హామీలకు అతీగతీ లేదు..

డిసెంబర్​1న కేటీఆర్ మీటింగ్​లో చెప్పిన హామీలకు ఆయా డిపార్ట్​మెంట్లు శాంక్షన్​ చేసిన పనులకు పొంతనే లేదు. ఆర్​అండ్​బీ రోడ్లకు  రూ.100 కోట్లు  ఇస్తామని కేటీఆర్​ప్రకటిస్తే కేవలం  రూ.56 కోట్లకు మా త్రమే శాంక్షన్​ ఇచ్చారు.  మునుగోడు  టు నాంపల్లి రూ.24 కోట్లు, నాంపల్లి టు పసునూరు రోడ్డుకు రూ.32.5 కోట్లు మంజూరు చేశారు. ఇవి టెండర్ల దశలోనే ఉన్నాయి.  పంచాయతీ రాజ్​ రోడ్లకు రూ.175 కోట్లు ప్రకటిస్తే కొత్త రోడ్లకు కేవలం రూ.14 కోట్లు మాత్రమే ఇచ్చారు.  వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు ఇచ్చిన రూ.18 కోట్లు కూడా రూ.175 కోట్ల లెక్కలోనే  చూపిస్తున్నారు. కానీ కొత్తగా ప్రపోజల్​ పెట్టిన రోడ్లను శాంక్షన్​ చేయలేదు.  చేసిన వాటిలో కొన్ని పనుల టెండర్లు పూర్తికాగా,  ఇంకొన్ని టెండర్ల దశలోనే ఉన్నాయి. ఇక గ్రామాల్లో రూ.27.48 కోట్లతో పూర్తిచేసిన సీసీ రోడ్లకు నేటికీ బిల్లులు రాలేదు.  ఉపాధి హామీ లేబర్​ బడ్జెట్​ మార్చి 6 నాటికి అయిపోవడంతో అప్పటి వరకు అప్​లోడ్​ చేసిన పేమెంట్స్ మాత్రమే జరిగాయి. ట్రైబల్​ వెల్ఫేర్​ కింద రూ.25 కోట్లు ప్రకటిస్తే కేవలం ఏడు రోడ్లకు మాత్రమే శాంక్షన్​ ఇచ్చారు.  చౌటుప్పల్​ మున్సిపాలిటికీ  రూ.50 కోట్లు ప్రకటిస్తే.. రూ.25 కోట్లకు మాత్రమే ఆర్డర్స్​ ఇచ్చారు. కానీ, పనులు జరగలేదు.  గట్టుప్పల్​లో  కేటీఆర్​ రూ.4 కోట్లతో ఫౌండేషన్ వేసిన చేనేత క్లస్టర్​ పనులకు అతీగతీ లేకుండా పోయింది. 

జాబ్స్​ ఇప్పిస్తమని చెప్పి జాడ లేరు..
నా డిగ్రీ పూర్తయి ఐదేండ్లు ఐతాంది..  మా ఊరు ముందే  పెద్ద కంపెనీ ఉన్నది..  దాని  పొల్యూషన్​తో బాధ పడ్తున్న మాకు జాబ్స్​ ఇవ్వకుండా..నాన్​ లోకల్స్​కు ఇస్తున్నరు.. మంత్రి మల్లారెడ్డి మాకు కంపెనీలో  జాబ్స్​ ఇప్పిస్తామని చెప్పిండు.. ఇంతవరకు జాడ లేడు.
- అన్న ప్రసాద్ రెడ్డి,  ఆరెగూడెం, చౌటుప్పల్​