వృద్ధులే టార్గెట్‌‌గా స్నాచింగ్​లు

  • రద్దీ ఏరియాల్లో సెల్​ఫోన్లు, పర్సులను కొట్టేస్తున్న గ్యాంగ్
  • ఇద్దరు అరెస్ట్‌‌.. 34.3 తులాల బంగారం స్వాధీనం  

హైదరాబాద్‌‌, వెలుగు: బస్సుల్లో, రద్దీ ఏరియాల్లో గోల్డ్ చైన్లు, పర్సులు కొట్టేస్తున్న మంగార్ బస్తీ గ్యాంగ్​కు చెందిన ఇద్దరిని ఈస్ట్​జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.18 లక్షల 50 వేల విలువైన 34.3 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్,  టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. మల్లేపల్లిలోని మంగార్‌‌ బస్తీకి చెందిన కేఎస్ మక్కాన్ 17 కేసుల్లో నిందితుడు. జైలులో ఉన్న టైమ్​లో దొంగలతో పరిచయాలు పెంచుకున్నాడు. బయటికి వచ్చిన తర్వాత మంగార్ బస్తీ, అఫ్జల్​సాగర్​కు చెందిన పాత నేరస్తులు భోలా, మన్నన్, సికిందర్, హీరా, బక్రీ, ఖదీర్​తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. సినిమా థియేటర్లలోని టికెట్ కౌంటర్ వద్ద, రద్దీగా ఉండే ఏరియాల్లో ఈ గ్యాంగ్ సెల్​ఫోన్లు, పర్సులు కొట్టేసెది.

ఎంజీబీఎస్, అఫ్జల్ గంజ్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, దిల్ సుఖ్ నగర్ రూట్లలో బస్సుల్లో ప్రయాణించే వృద్ధులను ఈ గ్యాంగ్ టార్గెట్ చేసేది. గ్యాంగ్ సభ్యుడు భోలా.. వృద్ధుల మెడలోని బంగారు గొలుసును పంటితో తెంచేవాడు. చైన్ కిందపడగానే మరొకరు దాన్ని తీసుకుని వెంటనే బస్సు దిగేవారు. బస్సు వెనకాలే మక్కాన్ ఆటోలో వచ్చి వీరిని ఎక్కించుకుని వెళ్లేవాడు. దొంగిలించిన గోల్డ్ చైన్లు, సెల్​ఫోన్లను శాలిబండలోని వ్యాపారి ప్రవీణ్ వర్మకు అమ్మేవారు. ఈ గ్యాంగ్​పై ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు.  గ్యాంగ్ సభ్యుడు మన్నన్​తో పాటు వ్యాపారి ప్రవీణ్ వర్మను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మక్కాన్ తో పాటు మిగతా సభ్యులు పరారీలో ఉన్నట్లు డీసీపీ సునీల్​దత్ తెలిపారు.