పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు...ప్రయాణికుల అరుపులు, కేకలు..12 మందికి తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది.  ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

పల్టీలు కొట్టింది..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు పల్టీలు కొట్టి.. రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలపాలయ్యారు.  ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులంతా భయాందోళనలకు గురై.. ఒక్కసారిగా అరుపులు, కేకలు వేశారు. తేరుకొని చూసేసరికి బస్సు రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లలో తలకిందులుగా పడి ఉంది. క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.