హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 18 ఏండ్లు నిండినవారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) వికాస్‌రాజ్ సూచించారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ స్థాయి ఆఫీసర్లు, సూపర్ వైజర్ అధికారులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ..అర్హులైన వారి ఓటరు నమోదుకు ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.
పది రోజుల్లో ఈ పక్రియ పూర్తి చేయలని ఆదేశించారు. అడిషనల్ ఎన్నికల ప్రధాన అధికారి లోకేశ్ కుమార్ మాట్లాడుతూ..ఓటరు జాబితా తయారీలో తప్పులు లేకుండా చూడాలని కోరారు. సిటీలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులతో పాటు ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీఈవో సర్పరాజ్ అహ్మద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.