తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET)-2024 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అంటే మార్చి 27న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది. గవర్నమెంట్ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. దీంతో విద్యాశాఖ కమిషనర్ మార్చి 27న క్లారిటీ ఇచ్చారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ, డీఈడీ చదివితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.