తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 షెడ్యూల్ మే 3న విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 20 నుంచి 29 వరకు పేపర్-2, మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి.
టెట్ ఎగ్జామ్ పేపర్-1లో 150 మార్కులు, పేపర్-2లో 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-2లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. ఎగ్జామ్ క్వాలిఫై మార్కులు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.