సత్యం, అహింస..భారతీయ తత్వం : వేణుగోపాల్ రెడ్డి

సత్యం, అహింస..భారతీయ తత్వం : వేణుగోపాల్ రెడ్డి

చికాగోలో మైడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అఫ్ అమెరికా అని నాడు వివేకానందుని సత్య గర్జన ఇప్పటికీ ఎలా మార్మోగుతుందో... లీడర్ ఆఫ్ ద అపోజిషన్​గా రాహుల్ గాంధీ 18వ లోక్​సభ తొలి చర్చలో ‘జై సంవిధాన్.. ఇదే మన రక్ష’  అనే నినాదం కూడా దేశంలో మార్మోగుతోంది.  రాహుల్​కు అండగా అధికార పక్ష సభ్యులు సైతం సంవిధాన్ అని నినదించడం శుభసూచకం. యథావిధిగా సభలో ఆయన్ని అడ్డుకోవడానికి యావత్ అధికార పక్షం ఏకమైనా, చివరికి ఎన్నడూ సమాధానం కోసం సైతం మధ్యలో లేవని ప్రధాని సైతం అడ్డుపడే రీతిలో రాహుల్ గాంధీ ప్రసంగించడం ప్రతి భారతీయ గుండెను తట్టిలేపింది. నాడు వివేకానందుడు ఏ హిందూ ధర్మం ఖ్యాతిని 

ప్రపంచానికి పరిచయం చేశాడో... నేడు రాహుల్ గాంధీ సైతం భారతీయ ఆత్మను సభలో హృద్యంగా ఆవిష్కరించారు. శివతత్త్వంతో పాటు దేశంలోని ప్రజలు ఇష్టంగా అనుసరిస్తున్న ఇస్లాం, క్రైస్తవ, బుద్ధ, జైన ఫిలాసఫీల అంతరార్థం ఒక్కటే అనే నిత్య సత్యాన్ని  సభ ముందుంచారు. గంటకు పైగా సాగిన రాహుల్ సత్య ప్రవాహానికి, ప్రతి తత్త్వాన్ని వివరించి చెప్తున్న తీరుకు సభతో పాటు ఆయా ధార్మిక ఆచరణవాదులు సైతం మంత్రముగ్ధులుగా వింటూ ఉండిపోయారు.  ప్రతి హిందువు ఆరాధించే శివుడు తన మెడలో ధరించిన పాము ద్వారా సత్యంవైపే ఉండే నిర్భయతత్త్వాన్ని, తన ముందు కాకుండా భుజాల వెనుక త్రిశూలాన్ని ధరించి అహింస తత్త్వాన్ని, తన అభయ ముద్రతో  నేనున్నాననే  ధైర్యాన్ని అందించే తీరును వివరించారు.  ఇదే తీరులో అభయ ముద్రతో ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని చెప్పారు.

హిందువులకు భయం, ద్వేషం ఉండదు

బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు  ప్రతిక్షణం హింస, అసత్యం, ద్వేషంతో ఉన్నారని దుయ్యబట్టారు. ఇలాంటివారు హిందువులెలా అవుతారని ఆక్షేపించారు.  తొలిసారి ప్రతిపక్ష నేత మాట్లాడేటప్పుడు ప్రధాని లేచి రాహుల్ మాటల్ని మొత్తం హిందువులకు అంటగట్టే ప్రయత్నాన్ని రాహుల్ అక్కడే గట్టిగా తిప్పికొట్టిన తీరు నభూతో నభవిష్యత్.  ఆచరణలోనూ మేమంతా హిందువులం మీరు కాదు అని స్పష్టంగా చెప్పారు. 

హిందువులకు భయం ఉండదని, ద్వేషం ఉండదని, అసత్యం మాట్లాడరని తెలిపారు. కానీ, బీజేపీ ఎలా హిందూత్వాన్ని వదిలేసిందో క్రిస్టల్ క్లియర్​గా చెప్పారు.  అందుకే రామజన్మభూమి అయోధ్యను ఎన్నికల అంశంగా మార్చినప్పటికీ హిందువులు తిరస్కరించారు.  అదానీ, అంబానీల కోసం వారి ఇండ్లను, భూముల్ని గుంజుకుంటుంటే అయోధ్యవాసులు ఓటుతో తిప్పికొట్టారు.  

ఫైజాబాద్ ఎంపీ రూపంలో బీజేపీని ఓడించి ఆ దేవుడు సైతం స్పష్టమైన నిజాన్ని చెప్పారన్నారు రాహుల్.  పదే పదే స్పీకర్ మతపరమైన అంశాలను మాట్లాడొద్దు అన్నప్పుడు సైతం అధికార పక్ష సభ్యులు ప్రస్తావించిన వాటికే సమాధానం చెబుతున్నానని రాహుల్ చేసిన సుతిమెత్తని చురక భవిష్యత్తులో అతన్ని ఎదుర్కోవడానికి ఎంతలా శ్రమించాలో వారికి అర్థమై ఉంటాయి. 

బీజేపీని వ్యతిరేకించిన ప్రజలు

 దేశ మూల సిద్ధాంతాలు అహింస, నిర్భయం, సత్యాలను ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ ఎలా విడిచిపెట్టాయో తనదైన శైలిలో రాహుల్​గాంధీ సభకు వివరించారు. బీజేపీలో అంతర్గతంగానైనా ఏ ఒక్కరూ గొంతు విప్పలేరని, స్వేచ్ఛ లేకుండా నిరంతరం భయంతో ఉంటారని, అధికారం కాపాడుకోవడానికి మతాన్ని అడ్డుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. 

తమలో ఉన్న భయంతోనే  రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనని బీజేపీ చేస్తుందని ఐతే దేశంలోని మిలియన్ల మంది ఈ భావనని మొన్నటి ఎన్నికల్లో వ్యతిరేకించారని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  అపోజిషన్ లీడర్లే కాదు బీజేపీ ఐడియాలజీపై పోరాడుతున్న మైనారిటీ, గిరిజనులు, రైతులు ఎంతోమందిని జైల్లో పెట్టారని. చివరకు తనపై సైతం 20కి పైగా కేసులతో  దాడులు చేసిన తీరును సభకు వివరించారు. ప్రతి దాన్ని తను సంతోషంతోనే ఎదుర్కొన్నానని చెప్పినప్పుడు సభికుల కళ్లు చెమ్మగిల్లాయి. 

అభయముద్ర కాంగ్రెస్​ గుర్తు

అధికారం కోసం అర్రులు చాచే నాయకులున్న ఈ రోజుల్లో ప్రతిపక్షంలో ఉండడం సైతం గర్వకారణంగానే ఉందని చెప్పిన ఏకైక నేత బహుశా రాజకీయాల్లో రాహుల్ గాంధీ మాత్రమే కావచ్చు.  అదే ప్రసంగంలో ఆయన చెప్పిన మరో అద్భుతమైన మాట అధికారాన్ని మించింది సత్యమని, అది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీలో లేదని, కేవలం తమదగ్గరే ఉందని  నమ్మిన యావత్ దేశం రాహుల్​గాంధీని కొనియాడుతోంది.  

అభయ ముద్రను గుర్తుగా ఉన్న కాంగ్రెస్ ఆచరించే సత్యం, అహింసలే  దేశవాసుల్ని భయాల నుంచి, హింసనుండి బయటపడేస్తుందని రాహుల్ గాంధీ ఉద్బోధించారు. నోట్ల రద్దు, అదానీ, అంబానీలకు దేశాన్ని ధారాదత్తం చేయమని దేవుడే చెప్పాడా అని నిలదీసినప్పుడు అధికార పక్షం నోరెళ్లబెట్టి చూసింది. జాతిపిత గాంధీజీకి మరణంలేదని, యావత్ భారతావని ఉన్నంత కాలం మహాత్ముడు బతికే ఉంటాడని రాహుల్ వివరిస్తుంటే గాంధీ తత్త్వానికి నిజవారసుడిలా ఆయన కనిపించాడు. 

ప్రజల గొంతును వినిపించేందుకే ప్రతిపక్షాలు

రాహుల్ గాంధీకి సొంత ఎజెండా లేదని, యావత్ దేశ ప్రతిపక్షం తరఫున తాను మాట్లాడుతున్నానని తన బాధ్యతను స్పష్టంగా చెప్పారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతల్లో ఉన్నవారెవరైనా ఆ బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాల్సి ఉంటుందని, స్పీకర్​ను మించిన శక్తి లోక్ సభలో మరెవరూ లేరని వ్యక్తి కంటే వ్యవస్థల గొప్పదనాన్ని చాలా చక్కగా వివరించారు.  ట్రూత్, కరేజ్, అహింస అనే భారత తత్త్వాల్ని కాపాడడం కోసమే ప్రభుత్వం పనిచేయాలని సత్యాన్ని చక్కగా వివరించారు. దేశ ప్రజల గొంతుని వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని దాన్ని వినడానికే మీరు అధికారంలో కూర్చున్నారని, మమ్మల్ని శత్రువులుగా తీసుకోవద్దని అదే ప్రభుత్వ కర్తవ్యమని సుతిమెత్తగా సూచించారు. 

కార్పొరేట్​ శక్తులకు గులాంగిరి

భారత్ జోడో యాత్రతో దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఏకమైన తీరును సభకు వివరించారు. ఉద్యోగాలు, ఉపాధిని ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో  సభ దృష్టికి రాహుల్ తెచ్చారు.  గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల, యూజ్ అండ్ త్రోలా సైనికుల్ని చూస్తున్న మోదీ  విధానాలైన అగ్నివీర్ తీరును కళ్లకు కట్టారు, అధికారంలోకి వచ్చేది మేమేనని అప్పుడు ఈ అప్రజాస్వామిక విధానాలకు చరమగీతం పాడతామని దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ భరోసానిచ్చారు. 

జమ్ము కాశ్మీర్, లద్దాక్, మణిపూర్లో బీజేపీకి ప్రాతినిథ్యం లేదన్న నిజాన్ని ఎలుగెత్తారు.  సివిల్ వార్ నడుస్తున్న మణిపూర్​కు ప్రధాని పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దోహదం చేసేలా నల్ల చట్టాల్ని తీసుకొచ్చిన తీరును, సంవత్సరాల తరబడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నీట్ విద్యార్థుల నమ్మకాన్ని ఎలా దెబ్బతీశారో తెలిపారు. అసలు పరీక్షను ధనవంతుల కోసమే డిజైన్ చేసినట్లు ఉందనీ మెరిట్లో ఉండే బీద విద్యార్థుల కోసం కాదని కుండబద్దలు కొట్టి చెప్పిన రాహుల్ తీరు  ప్రశంసనీయం. 

బోదనపల్లి 
వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టిశాట్ నెట్​వర్క్,
అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక.