లక్ష రూపాయల లంచం.. ఏసీబీకి పట్టుబడిన TSCCDCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

లక్ష రూపాయల లంచం.. ఏసీబీకి పట్టుబడిన TSCCDCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఏసీబీకి పట్టుబడని ప్రభుత్వ విభాగం లేదు. పంచాయతీ కార్యదర్శి మొదలు.. తహసీల్దార్, ఎస్ఐ, సీఐ, కలెక్టరేట్ అసిస్టెంట్ వరకూ అన్ని విభాగాల ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. అయినప్పటికీ, ఇతర ఉద్యోగులు తమ తీరు మార్చుకోవడం లేదు. పైసలిస్తేనే ఫైలు కదులుతుందని ఖరాఖండిగా చెప్తున్నారు. అడిగినంత ముట్ట చెప్పకపోతే, నీ పని కాదని ముఖం మీదనే చెప్తున్నారు. ఆ సమయంలో సరేనని తలూపుతున్న ప్రజలు.. ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చి వారి ఆట కట్టిస్తున్నారు.

లంచాలకు అలవాటు పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి గురువారం(ఫిబ్రవరి 20) ఏసీబీ వలకు చిక్కాడు. పట్టుబడిన ఉద్యోగి పేరు.. బొప్పూరి ఆనంద్ కుమార్(B. Anand Kumar). హైదరాబాద్, మసబ్ ట్యాంకులో ఉన్నటువంటి తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(TSCCDCL)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 

Also Read :- 26 కార్లు అద్దెకు తీసుకుని అమ్మేశాడు

ఆనంద్ కుమార్.. ఓ ఫిర్యాదు దారుడికి సంబంధించిన రూ.33లక్షల బిల్లును ప్రాసెస్ చేయడానికి లక్షాముప్పై మూడు వేలు(రూ.1,33,000) డిమాండ్ చేశాడు. అందులో భాగంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఆనంద్ కుమార్ పట్టుబడటంతో అధికారులు అప్రమత్తయ్యారు. మసబ్ ట్యాంకులోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు. 

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”