ప్రధాని మోదీ రాజ్యాంగానికి ప్రమాదకారి: ఆకునూరి మురళి

నిర్మల్, వెలుగు: ప్రధాని మోదీ రాజ్యాంగానికి ప్రమాదకారిగా మారారని టీఎస్డీఎఫ్‌‌‌‌ కన్వీనర్, మాజీ ఐఏఎస్‌‌‌‌ ఆకునూరి మురళి ఆరోపించారు. జాగో తెలంగాణలో భాగం గా టీఎస్డీఎఫ్‌‌‌‌ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం నిర్మల్‌‌‌‌కు చేరుకుంది. యాత్రకు స్థానిక అంబేద్కర్ చౌక్‌‌‌‌ వద్ద ప్రజా, కార్మిక సంఘాల నేతలుస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆకునూరి మురళి మాట్లాడారు.

దేశ సంపదను అదాని, అంబాని వంటి పెట్టుబడిదారులకు అప్పగించి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేశారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలి అధికారం కోసం విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్న మోదీని గద్దె దించా లని పిలుపు నిచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లను ఎత్తివేస్తామని పదే పదే చెబుతున్న మోదీకి గుణపాఠం చెప్పాలన్నారు.

పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూ.12 లక్షల కోట్లు వసూలు చేసిన కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది నామమాత్రమేనన్నారు. కార్పొరేట్ల అప్పులను రద్దు చేయ డం ద్వారా రూ. 16 లక్షల కోట్లను అదానీ, అంబానీ వంటి కంపెనీలకు దోచిపెట్టారని ఆరోపించారు. బస్సు యాత్ర సమన్వయకర్త నైనాల గోవర్ధన్‌‌‌‌, ప్రొపెసర్లు కె.లక్ష్మీ నారాయణ, పద్మజాషా, న్యూడెమోక్రసీ నాయకుడు శ్రీనివాస్, డీబీఎఫ్‌‌‌‌ జాతీయ కార్యదర్శి శంకర్‌‌‌‌ రాయదాస్, నంది రామయ్య పాల్గొన్నారు.