- టీఎస్ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కామెంట్
- కేటీఆర్‌కు మతి భ్రమించింది: ఈరవత్రి అనిల్, ప్రీతమ్
హైదరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడ కట్టలేదని, రెనోవేషన్ పనులు మాత్రమే సాగుతున్నాయని టీఎస్ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ చెప్పారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన సైతం ఇచ్చిందన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, ఆ పార్టీ నేతలకు మతి భ్రమించిందని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ను అవమానించిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
బుధవారం గాంధీ భవన్ లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం బందీగా మారిందంటూ సరిత అనే మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందన్నారు. రెనోవేషన్ లో భాగంగా పనులు చేస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ మాట్లాడుతూ..అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఐరన్ గ్రిల్స్ ఉండటం వల్ల అక్కడకు వచ్చే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే జీహెచ్ఎంసీ రెనోవేషన్ పనులు చేస్తోందన్నారు.
కాగా, గోడను కూలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరవత్రి నేతృత్వంలోని బృందం బుధవారం లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేసింది.