టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలగా ఉన్న రేణుకకు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు రేణుకకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తు, పాస్ పోర్టు సమర్పించాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు రేణుకకు ఆదేశించింది.
గతంలో కూడా రేణుక బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని తిరస్కరించింది. రేణుక అనారోగ్యం, మహిళ కావడం, కేసు కూడా చివరి దశలో ఉండటంతో రేణుకకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపు లాయర్ గుమ్మకొండ శ్రీనివాసరావు కోర్డును కోరారు. దీంతో ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఇక, ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు.. రాజేందర్, రమేష్ కుమార్‌లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకే కేసులో ఓవైపు ఈడీ, మరోవైపు సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 23 మందిని అరెస్టు చేసిన ఈడీ నిందితులను క్షుణ్నంగా విచారిస్తోంది.