
- గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాలి
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్
- బీసీలకు 70 సీట్లు ఇస్తామని వెల్లడి
- కేసీఆర్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఫైర్
కాగజ్నగర్, వెలుగు: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను లోపభూయిష్టంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీకి హైకోర్టు తీర్పుతోనైనా కనువిప్పు కలగాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన టీఎస్ పీఎస్సీ కమిషన్ చైర్మన్ సహా సభ్యులంతా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో పోటీచేయనున్న ఆయన.. బుధవారం కౌటాల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న బీసీలకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లు కేటాయించడంలో ఆయా పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని విమర్శించారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23 అసెంబ్లీ సీట్లు కేటాయించిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని సీట్లు ఇస్తారో ప్రకటించకపోవడం బీసీలపై చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో పనిచేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి బీఎస్పీలో చేరాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ బీసీలకు 60 నుంచి-70 సీట్లు కేటాయిస్తుందని తెలిపారు.
బీఎస్పీ తప్ప మిగిలిన పార్టీలన్నీ రహస్య ఎజెండాతో బహుజనులను ఓటర్లుగానే చూస్తూ ఎన్నికల వేళ సంక్షేమ పథకాలను ఎరగా వేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించి బీఎస్పీని గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఎస్పీలో చేరిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. అలాగే సమ్మె చేస్తున్న అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర సర్కారు మొద్దునిద్ర వీడి అంగన్ వాడీలు, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఆర్ఎస్ సూచించారు. ఆయన వెంట బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి ఉన్నారు.