
రాష్ట్ర స్థాయిలో ఉన్నత కొలువులకు మార్గం వేసే గ్రూప్-1 పరీక్షకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లక్షల్లో పోటీ ఉండే ఎగ్జామ్‌కు గ్రాడ్యుయేట్ల నుంచి పీహెచ్‌డీ స్కాలర్స్ వరకు ఎంతో మంది ప్రతిభావంతులు పోటీ పడుతుంటారు. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. దాని స్థానంలో 563 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రిలిమ్స్‌లో గట్టెక్కేందుకు సిలబస్, ప్రిపరేషన్ ప్రణాళిక గురించి తెలుసుకుందాం...
ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్షను వచ్చే మే లేదా జూన్ నెలల్లో, ప్రధాన(మెయిన్) పరీక్షను సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహిస్తామని వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్-1 (4/22 నోటిఫికేషన్)కు దరఖాస్తు చేసుకున్నవారూ పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది.
పోస్టులు: డిప్యూటీ కలెక్టర్లు- 45, డీఎస్పీ- 115, సీటీవో- 48, ప్రాంతీయ రవాణా అధికారి- 4, జిల్లా పంచాయతీ అధికారి- 7, జిల్లా రిజిస్ట్రార్- 6, జైళ్లశాఖలో డీఎస్పీ- 5, అసిస్టెంట్ లేబర్ కమిషనర్- 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్- 30, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌లు- 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి- 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి-2, జిల్లా ఉపాధి అధికారి- 5, పరిపాలనాధికారి (వైద్యారోగ్యశాఖ)- 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్- 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 41, మండల పరిషత్ అభివృద్ధి అధికారి- 140.
అర్హత: ఆర్టీవో పోస్టుకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులన్నింటికీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏసీఎల్ పోస్టుకు డిగ్రీతో పాటు సోషల్ వర్క్‌లో పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. డీఎస్పీ, ఏఈఎస్ ఫోస్టులకు ఎత్తు 165 సెంటీమీటర్లు, ఛాతీ చుట్టుకొలత 86.3 సెంటీమీటర్లు, శ్వాస పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. యూనిఫామ్ సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఏఈఎస్), ఆర్టీవో పోస్టులకు కనిష్ట, గరిష్ట వయోపరిమితులు 21 నుంచి 35 ఏళ్లు కాగా.. మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వరకు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే లేదా జూన్‌లో, మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: గ్రూప్ 1 పరీక్ష రెండంచెల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ ఇందులో నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో జరుగుతుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ పరీక్ష 150 మార్కులకు మూడు గంటలు ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే.
టైమ్ మేనేజ్మెంట్: గ్రూప్–1 ప్రిపరేషన్ లో అభ్యర్థులు సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్ మే లేదా జూన్ లో ఉన్నందున ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రిపరేషన్ చివరి దశలో రివిజన్ కోసం ఒక వారం రోజులు మినహాయిస్తే.. అభ్యర్థులు ప్రతిరోజు ప్రిలిమ్స్‌తో పాటు కొంత సమయం మెయిన్స్ కూడా కేటాయించి ప్రిపేర్ అవ్వాలి.
ఏ సబ్జెక్ట్ వదలొద్దు: అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో భాగంగా ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా సమయ పాలన పాటించాలి. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌లో మొత్తం 13 అంశాలను పేర్కొన్నారు. వీటిలో కొన్ని ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటూ చదివే టాపిక్స్ కూడా ఉన్నాయి. (ఉదా: కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; భారత రాజ్యాంగం విధానం, పరిపాలన తదితర). వీటన్నింటిని బేరీజు వేసుకుంటే..అభ్యర్థులు ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
సిలబస్ అర్థం చేసుకోవాలి: కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించే అభ్యర్థులు.. తొలుత సిలబస్‌ను ఆకళింపు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దాని ఆధారంగా చదవాల్సిన ముఖ్యమైన టాపిక్స్ స్పష్టత ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థులు తమకున్న సామర్థ్యం, ఆయా అంశాలపై అప్పటికే ఉన్న నైపుణ్యం ఆధారంగా.. ప్రిపరేషన్ సమయంలో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ ఇటీవల కాలంలో నిర్వహించిన ఇతర నియామక పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్లను పరిశీలించడం మేలు చేస్తుంది. దీనివల్ల పరీక్షలో ప్రశ్నలు అడిగే తీరుతోపాటు ముఖ్యమైన అంశాలను గుర్తించవచ్చు.
అంతర్జాతీయం నుంచి ప్రాంతీయం వరకు: అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు మొదలు స్థానిక అంశాల వరకూ.. అన్నింటిపైనా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రాధాన్య పరిణామాలపై ఫోకస్ చేయాలి. తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీల గురించి చదవాలి.
ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్: గ్రూప్స్ అభ్యర్థుల్లో చాలా మందిలో నెలకొనే సందేహం.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌కు కూడా చదవొచ్చా? అనేది. ప్రస్తుత సిలబస్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ అవకాశం ఉందనే చెప్పాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మెయిన్స్, ప్రిలిమ్స్ అంశాల సిలబస్‌ను బేరీజు వేసుకుని.. వ్యాసరూప విధానంలో చదివే నేర్పు సొంతం చేసుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండింటికీ సన్నద్ధత లభిస్తుంది.
స్ట్రాటజీ: అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్, మెయిన్ సిలబస్‌ను పరిశీలించాలి. ఆయా అంశాలపై ఉన్న అవగాహన స్థాయి, నైపుణ్యం ఆధారంగా సమయ పాలన రూపొందించుకోవాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా ప్లాన్ చేసుకోవాలి. రోజుకు 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కే సమయం కేటాయించాలి. మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు వంటి వాటికి హాజరై.. వ్యక్తిగత సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. పరీక్షకు వారం రోజుల ముందు రెడీ రెకనర్స్, తాము రాసుకున్న షార్ట్ నోట్స్ ఆధారంగా పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ప్రతి దశలోనూ సమయ పాలనకు ప్రాధాన్యమిస్తూ.. నిర్దిష్ట ప్రణాళికతో చదివితే మలి దశ మెయిన్స్‌కు అర్హత సాధించొచ్చు.
డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్
అభ్యర్థులు ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే సదరు అంశానికి సంబంధించి అన్ని విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి అడిగితే.. వాటిపై బిట్ బ్యాంకులకు పరిమితం కాకుండా.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవాలి. ఫలితంగా ఏ కోణంలో ప్రశ్న అడిగినా జవాబు గుర్తించగలుగుతారు. ఇది మెయిన్స్‌కు ఉపయోగపడుతుంది.
తెలంగాణ అంశాలపై ఫోకస్
తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాల విషయంలో... పరీక్షలో కొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలంగాణ కల్చర్, జాగ్రఫీ, పథకాలపై అవగాహన పెంచుకోవాలి. నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి వాటిపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. అదే విధంగా రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించిన విధానాలపై ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌లో తెలంగాణ ఉద్యమం టాపిక్ లేకపోవ డంతో కల్చర్ మీద ఫోకస్ చేయాలి.
- వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్