TSPSC Group 1 : మళ్లీ మళ్లీ రద్దు అయిన గ్రూప్ 1

నోటిఫికేషన్ ప్రకటించిన ముహూర్తం మంచిగలేదో..లేక నిరుద్యోగుల దురదృష్టమో కానీ..తెలంగాణలో ఏ పరీక్ష రాసినా..అవి రద్దవుతూనే ఉన్నాయి. తాజాగా గ్రూప్ 1 పరీక్ష మళ్లీ మళ్లీ రద్దవుతున్నాయి. 

తొలిసారి రద్దు..

టీఎస్పీఎస్సీ తొలిసారిగా 503 గ్రూప్  1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌ 26వ తేదీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మెయిన్స్ నిర్వహణకు సిద్ధం అవుతున్న సమయంలో  టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ బాగోతం బయటపడడంతో ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండోసారి రద్దు..

ఆ తర్వాత జూన్ 11న రెండోసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి  మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.  ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీను కూడా విడుదల చేశారు. ఈ పరీక్ష రాసిన విద్యార్థులంతా మెయిన్స్కు సిద్దమవుతున్నారు. కానీ ఈ పరీక్ష కూడా రద్దయింది. 

ALSO READ : TSPSC గ్రూప్ 1 పరీక్ష.. మళ్లీ రద్దుకు కారణాలేంటి?

జూన్ 11వ తేదీ తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో  బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయలేదు. దీంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు..గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. మరోసారి నిర్వహించాలని సూచించింది.