
- అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులు
- ఈ నెల 24 వరకు రీకౌంటింగ్‌కు చాన్స్
- ఆ తర్వాతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులను ప్రకటించారు. ఈ నెల 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. సోమవారం టీజీపీఎస్సీ ఆఫీసులో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేశారు. కమిషన్ వెబ్ సైట్లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ద్వారా పేపర్ల వారీగా మార్కులను పొందొచ్చని ఆయన వివరించారు. మొత్తం ఏడు పేపర్ల మార్కులు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5గంటల వరకు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని, అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ మార్కుల షీట్‌ను డౌన్ లోడ్ చేసుకొని, రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలని ఆయన సూచించారు. వచ్చిన మార్కులపై ఏమైనా సందేహాలుంటే.. టీజీపీఎస్సీ పోర్టల్‌లో ఈ నెల10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రీకౌటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఇందుకోసం ప్రతి పేపర్‌కు రూ.వెయ్యి చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుందని, ఆఫ్ లైన్లో ఎట్టి పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకోబోమని చైర్మన్ స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ ప్రక్రియ తర్వాతే జనరల్ ర్యాకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ల ను వెల్లడిస్తామన్నారు. జీఆర్ఎల్ తర్వాత అవసరమైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని పేర్కొన్నారు. ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే.. టీజీపీఎస్సీ టెక్నికల్ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 040-23542185కు గానీ, 040-23542187కు గానీ కాల్ చేయొచ్చని.. లేదా helpdesk@tspsc.gov.inకు ఈ–మెయిల్ చేయవచ్చని కమిషన్‌చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. కార్యక్రమంలో టీజీపీఎస్సీ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్ , యాదయ్య, రామ్ మోహన్ రావు, పాల్వాయి రజనికుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇంగ్లిష్‌లో క్వాలిఫై అయితేనే ర్యాంక్
రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి నిరుడు అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్1 మెయిన్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 31,403 మందిని ఎంపిక చేస్తే.. 21,093 మంది అటెండ్ అయ్యారు. ఇంగ్లిష్ తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఒక్కో పేపర్ 150 మార్కులుంటాయి. అయితే, దీనిలో ఇంగ్లిష్ ఎగ్జామ్ క్వాలిఫై టెస్టు. దీంట్లో క్వాలిఫై అయితే.. మిగిలిన ఆరు పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కిస్తారు. ఇంగ్లిష్ లో జనరల్ కేటగిరీల అభ్యర్థులకు 40 శాతం, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకే మిగిలిన ఆరు సబ్జెక్టులకు సంబంధించి 900 మార్కులకు గానూ.. వచ్చే మార్కులను బట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది.