గ్రూప్ 2 వాయిదా కష్టమే!

  • గ్రూప్ 2 వాయిదా కష్టమే! 
  • ఆగస్టు 29, 30న నిర్వహించేందుకే టీఎస్​పీఎస్సీ మొగ్గు
  • ఇప్పటికే ఆ రోజుల్లో సెంటర్లకు సెలవులు 
  • వాయిదా వేస్తే ఐదారు నెలలు లేట్ అవుతుందంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు:  ఆగస్టు 29, 30వ తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ భావిస్తున్నది. ఒకవేళ పోస్ట్​పోన్ చేస్తే.. మళ్లీ ఐదు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఎన్నికల షెడ్యూల్ వస్తే నిర్వహణ మరింత కష్టమవుతుందని అంటున్నారు. ఎగ్జామ్స్ వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నా.. టీఎస్​పీఎస్సీ మాత్రం గతంలో ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. దీంతో ఇక గ్రూప్ 2 పరీక్షల వాయిదా కష్టమే అని తెలుస్తున్నది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

దీంతో 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. అయితే, ఆగస్టు 29, 30వ తేదీల్లో ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఐదు నెలల కిందే టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. ఈక్రమంలో పరీక్ష నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. తాజాగా సెంటర్లను కూడా ఖరారు చేసింది. సెంటర్లుండే స్కూల్స్, కాలేజీలకూ సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు నెలలోనే పలు పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో రెండింటికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో కొంత ఆందోళన మొదలైంది. రెండు పరీక్షలకు ప్రిపేర్ కావడం ఇబ్బందిగా ఉందని, గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను, టీఎస్​పీఎస్సీ అధికారులను కలిశారు. చివరికి ఆఫీస్ ముందు ఆందోళన కూడా చేపట్టారు.

ALSO READ :దేశీయ వర్సిటీల్లో బీసీ స్టూడెంట్లకు విదేశీ విద్యాసాయం:గంగుల 

ఆ రోజుల్లో సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన గ్రూప్ 3, డీఏవో, హాస్టల్ వార్డెన్ తదితర పరీక్షలకు సంబంధించిన తేదీలను టీఎస్​పీఎస్సీ ప్రకటించలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్ చూసి తేదీలను ఖరారు చేయాల్సి వస్తున్నది. ఈ క్రమంలో గ్రూప్ 2 పరీక్షలను ఆగస్టు 29, 30న సెలవు రోజుల్లో కాకుండా వర్కింగ్ డేస్​లో పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ రెండు రోజులు స్కూల్స్, కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. మరోపక్క గ్రూప్ 3 ఎగ్జామ్స్​ను అక్టోబర్​లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. 

ఒకవేళ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తే, కొత్త డేట్లు దొరకడం కష్టంగా ఉందని టీఎస్ పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ నుంచి ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దీంతో అధికారులందరూ ఎన్నికల ఏర్పాట్లలోనే ఉంటారు. ఇలాంటి టైంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదు. దీంతో పాటు కొందరు అభ్యర్థులు పాత డేట్లతోనే పరీక్షలు నిర్వహించాలని టీఎస్​పీఎస్సీని కోరుతున్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.