తెలంగాణ జాబ్స్ స్పెషల్ ..జనాభా పరిణామ సిద్ధాంతం

తెలంగాణ జాబ్స్ స్పెషల్ ..జనాభా పరిణామ సిద్ధాంతం

గ్రూప్​–2, గ్రూప్​–3 సిలబస్​లో డెమోగ్రఫికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 20కి పైగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జనాభా పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి దేశ జనాభా పరిణామంలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో జనన మరణరేట్లు అధికంగా ఉంటాయి. రెండో దశలో మరణరేటు తగ్గుతుంది కానీ జనన వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. మూడో దశలో ఈ దశలో జనన, మరణరేట్లు రెండూ అల్పలంగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల సమస్య ఉండదు.

జనన, మరణరేట్లకూ ఆర్థికాభివృద్ధికీ మధ్యగల సంబంధాన్ని తెలియజేసేది జనాభా పరిణామ సిద్ధాంతం. దీన్ని థామ్సన్​, నోటెస్టీన్​లు మొదటగా పేర్కొన్నారు. కోల్​, హోవర్​లు ఎకనామిక్​ డెవలప్​మెంట్​ ఇన్​ లో ఇన్​కం కంట్రీస్​ అనే గ్రంథంలో జనాభా పరిణామ సిద్ధాంతాన్ని చర్చించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి దేశం మూడు దశల గుండా పయనిస్తుంది. 

మొదటి దశ : జనన మరణరేట్లు అధికంగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. మరణ రేటు కంటే జనన రేటు కొంచెం ఎక్కువగా ఉన్నా అది అంత తీవ్రమైన సమస్య కాదు. ఈ దశలో ఆర్థికాభివృద్ధి తక్కువగా ఉంటుంది. వ్యవసాయ ఆధిక్యత, తక్కువ తలసరి ఆదాయం, అల్పజీవన ప్రమాణం, పౌష్టికాహార కొరత, ఆరోగ్య సదుపాయాల కొరత, ప్రాణాంతక వ్యాధులకు నివారణ లేకుండుట, అధిక శిశుమరణ రేటు మొదలైన కారణాల వల్ల మరణరేటు అధికంగా ఉంటుంది. ఎక్కువ మందికి సరిపడినంత సమతౌల్య ఆహారం కూడా ఉండదు. బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణా సాధనాలపై అవగాహన లేకుండటం వంటి కారణాల వల్ల జననాలూ అధికంగా ఉంటాయి. విద్యావకాశాలు కొరవడతాయి. అల్ప విద్య, మూఢ నమ్మకాల వల్ల అధిక జనన రేటు ఉంటుంది. కొన్ని ఆర్థిక కారణాలు కూడా అధిక జనన రేటుకు దోహదపడును. తక్కువ వయసులోనే వ్యవసాయ ఉత్పత్తిలో పాల్గొనడం, తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పిల్లలు భద్రతగా ఉపయోగపడటం, కుటుంబ నియంత్రణ పట్ల ఉదాసీనంగా ఉండటం మొదలైన కారణాల వల్ల అధిక జననాలను కోరుకుంటారు. ఇది అధిక మరణరేటుకు సరిపోవడంతో ఎక్కువ కాలం జనాభా స్థిరంగా ఉంటుంది. 1921కు పూర్వం భారతదేశం ఈ దశలో ఉంది. 

రెండో దశ : మరణరేటు తగ్గినంత వేగంగా జననరేటు తగ్గకపోవడంతో జనాభా వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ఆర్థికాభివృద్ధి నెమ్మదిగా సాగడం వల్ల తలసరి ఆదాయం, జీవన ప్రమాణం, పౌష్టికాహార లభ్యత పెరుగుతుంది. ఫలితంగా మరణరేటు వేగంగా తగ్గుతుంది. అంటువ్యాధుల నివారణ, వైద్య సదుపాయాల విస్తరణ మరణరేటు తగ్గేందుకు దోహదపడును. విద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరించడం, ప్రభుత్వం స్మాల్​ ఫాక్స్​, మలేరియా, కలరా, ప్లేగు వంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల మరణరేటు తగ్గుతుంది. అయితే, అక్షరాస్యత ఒక వర్గం వారికే పరిమితం కావడం, అక్షరాస్యత దిగువ వర్గాలకు చేరకపోవడం వల్ల సాంఘిక పరిస్థితులు, మూఢనమ్మకాల వల్ల కుటుంబ పరిమాణంపై ప్రజల ఆలోచనా విధానంలో పెద్దగా మార్పు రాకపోవడంతో జననరేటు నెమ్మదిగా తగ్గుతుంది. ఫలితంగా జనన, మరణాల మధ్య అసమతౌల్యం ఏర్పడి జనాభా విజృంభణ లేదా విస్ఫోటనం సంభవిస్తుంది. ఈ దశలో అధిక జననరేటు, అల్ప మరణరేటు ఉంటుంది. ఈ దశలో జననరేటు 35–40 మధ్యలో ఉంటుంది. మరణరేటు 15–20 మధ్యలో ఉంటుంది. వార్షిక వృద్ధిరేటు 2శాతంపైనే నమోదవుతుంది. అందుచే ఎక్కువ జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉంటారు. 1921 నుంచి భారతదేశం ఈ దశలోకి ప్రవేశించింది. 

మూడో దశ : ఈ దశలో జననరేటు చెప్పుకోదగిన విధంగా తగ్గడంతో జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉంటుంది. ఈ దశలో జనన, మరణరేట్లు రెండూ అల్పంగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల సమస్య ఉండదు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మారడం, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటం, గ్రామాలు పట్టణాలుగా మారడం, పట్టణాల్లో నీటి, గృహ సమస్యలేర్పడటం, అక్షరాస్యత దిగువ వర్గానికి చేరడం, స్త్రీ ఉపాధిలో పాల్గొనడం వల్ల అధిక సంతానాన్ని భారంగా భావించడం మొదలైన కారణాల వల్ల జననరేటు తగ్గుతుంది. పట్టణ జీవన విధానం, పారిశ్రామికీకరణ, కుటుంబ పరిమాణంపై ప్రజల ఆలోచనా దృక్పథాలను గణనీయంగా మార్చుతుంది. విద్య మూఢనమ్మకాలను తొలగించి శాస్త్రీయ దృక్పథాలను పెంచుతుంది. ఈ కారణాల వల్ల ఈ దశలో జననరేటు కూడా తగ్గుతుంది. జననరేటు కూడా 35–40 నుంచి 15–20 కి తగ్గుతుంది. జనాభా పరిణామం అంటే అధిక జనన, మరణ రేట్ల సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా విభజించుతుంది. మ్యాక్స్​ అనే ఆర్థికవేత్త జనాభా పరిణామ సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా విభజించారు. 

1వ దశ : అధిక జనన, మరణ రేట్లు, తక్కువ జనాభా వృద్ధిరేటు.
2వ దశ : అధిక, నిలకడ జననరేటు, వేగంగా తగ్గే మరణరేటు, సత్వర జనాభా వృద్ధి.
3వ దశ : తగ్గుతున్న జననరేటు, తక్కువ నిలకడ మరణరేటు, వేగంగా పెరిగే జనాభా. 
4వ దశ : తక్కువ జనన, మరణరేట్లు, అల్పస్థాయిలో నిలకడ జనాభా. 

ప్రపంచ జనాభా స్వరూపం

ప్రపంచ జనాభా మొదటి బిలియన్​ 1830 దశకంలో, రెండో బిలియన్​ 1930 దశకంలో, మూడో బిలియన్​ 1960 దశకంలో చేరింది. నాలుగో బిలియన్​ 1975 నాటికి, ఐదో బిలియన్​ 1987 జులై 11 నాటికి చేరుకుంది. కేవలం 12 సంవత్సరాల్లో 1 బిలియన్​ జనాభా పెరిగి 1987 జులై 11 నాటికి ఐదు బిలియన్లకు చేరింది. అందుకే జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించారు. 1999 అక్టోబర్​ 12 నాటికి ఆరు బిలియన్లకు  చేరడంతో అక్టోబర్​ 12ను డే ఆఫ్​ 6 బిలియన్​గా పిలుస్తారు. 2011 అక్టోబర్​ 31 నాటికి ఏడు బిలియన్లకు చేరింది. 

  • ప్రపంచ విస్తీర్ణంలో 2.4శాతం వాటా కలిగిన భారతదేశం ప్రపంచ జనాభాలో 2001 నాటికి 16.7శాతం వాటాను కలిగి ఉంది. అంటే ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. 2011 జనాభా లెక్కల్లో భారత జనాభా ప్రపంచంలో 17.5శాతం వాటా కలిగి ప్రతి ఆరుగురిలో ఒకరు కంటే కొంచెం ఎక్కువగా భారతీయులే ఉన్నారు. 1 బిలియన్​ జనాభా దాటిన దేశాల్లో చైనా తర్వాత భారతదేశంలో రెండోదిగా ఉంది. జనాభాలో మూడో పెద్ద దేశమైన అమెరికా జనాభా కంటే భారతదేశ జనాభా నాలుగు రెట్లు (2011 నాటికి) అధికం. విస్తీర్ణంలో అతిపెద్ద దేశమైన రష్యా జనాభా కంటే భారతదేశంలో ఒక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్​ జనాభా అధికంగా ఉండటం చెప్పుకోదగిన అంశం. 
  • యూఎన్​ఓ అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా వృద్ధిరేటు 1.23శాతం. చైనా జనాభా వృద్ధిరేటు 0.53శాతం. భారత జనాభా వృద్ధిరేటు 1.64శాతం.
  • పాపులేషన్​ రిఫరెన్స్​  బ్యూరో వారి అంచనాల ప్రకారం 2030 నాటికి చైనా జనాభాను భారతదేశ జనాభా అధిగమిస్తుంది. అమెరికా పాపులేషన్​ బ్యూరో అంచనా ప్రకారం 2025 నాటికి  భారతదేశం చైనా జనాభాను అధిగమించగలదు. 
  • భారతదేశంలో తొలిసారిగా లార్డ్​ మేయో కాలంలో 1872లో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. అయితే, పూర్తిస్థాయి జనాభా లెక్కలు సిరీస్​ ఆఫ్​ సెన్సెస్​ ప్రకారం 1881 లార్డ్​రిప్పన్​ కాలంలో ప్రారంభమైంది.    

జాతీయ సమగ్రత

దేశంలో ఉన్న విస్తృతమైన భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో సమైక్యత, సమగ్రత అనే పదాలు చేర్చారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సమగ్రత అనే పదాన్ని చేర్చారు. పీఠికలో అంతర్భాగంగా ఉన్న సౌభ్రాతృత్వ భావన ద్వారా సమైక్యత, సమగ్రతలను సాధించవచ్చు. ప్రాథమిక విధుల్లో కూడా ప్రతి పౌరుడు దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించాలని పేర్కొంది. సమైక్యతను సాధించే ఉద్దేశంతోనే మైనార్టీలకు, షెడ్యూల్డ్​ కులాలకు, షెడ్యూల్డ్​ తెగలకు వెనుకబడిన కులాలకు, ఆంగ్లో ఇండియన్​లకు ప్రత్యేక రక్షణలు కల్పించారు.  

జాతీయ సమైక్యతకు అవరోధాలు 

కులతత్వం : ఒక కులం వారు మరో కులంపై ఈర్ష్య, ద్వేషం, పక్షపాతాలను కలిగి ఉండే ప్రవర్తనే కులతత్వం. ఈ కులతత్వం ప్రస్తుతం జాతీయ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. 1960 దశకంలో ఉన్నత కులాలు, నిమ్న కులాల మధ్య ఏర్పడిన హింసాత్మక ధోరణులను కుల యుద్ధం, కుల వైరం, కుల మారణ హోమం అని విద్యావేత్తలు వర్ణించారు.  

మతతత్వం : ఆధునిక భారతదేశ చరిత్రలో మతవాదం ఒక నిర్దిష్టమైన భావజాలంగా అభివృద్ధి చెందింది. ఒక మతానికి చెందిన ప్రజలు తమ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక మత ప్రయోజనాల కోసం మత ప్రాతిపదికన సంఘటితమై ఉద్యమించడం మతతత్వంగా చెప్పవచ్చు. 

ప్రాంతీయతత్వం : ప్రాంతం అనేది ఒక సమాజ శాస్త్రీయ అస్తిత్వం. ఎస్​.ఆర్​.మహేశ్వరి అభిప్రాయం ప్రకారం ప్రాంతం అనేది భౌగోళిక పరిస్థితి, స్థలాకృతి, భాష, మతాలు, సాంస్కృతిక ఆచరణలు, ఆచారాలు, అభివృద్ధి సామాజిక ఆర్థిక రాజకీయదశలు, చారిత్రిక నేపథ్యం, సమష్టి జీవన విధానం, ప్రజల్లో మనం అనే భావన లాంటి చలాంకాల ఆధారంగా ఇతర ప్రాంతాల కంటే ప్రత్యేకంగా ఉండే ప్రాంతం. 

భాషాతత్వం : భారతదేశం విభిన్న మతాలకు, భౌగోళిక ప్రదేశాలకు, జాతులకు, భాషలకు నిలయం. భారత రాజ్యాంగంలో 22 భాషల ప్రస్తావన ఉంది. అయితే, గత కాలం నుంచి ప్రస్తుతం వరకు భాషను ఆధారంగా చేసుకుని ప్రత్యేక ప్రాంత, ప్రత్యేక రాష్ట్రోద్యమాలు చోటుచేసుకున్నాయి.