
- ..2,49,557 మందికి జనరల్ ర్యాంకులు
- మరో 18,364 మంది పేపర్లు ఇన్ వ్యాలిడ్
- టాప్ టెన్ లో 9 మంది అబ్బాయిలే
- 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన
- మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)తో పాటు ఫైనల్ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం శుక్రవారం రిలీజ్ చేశారు. రాష్ట్రంలో 1,388 పోస్టుల భర్తీకి గత నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరిగాయి. 5,36,400 మంది అప్లై చేయగా 2,67,921 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,49,557 మందికి జనరల్ ర్యాకింగ్ లిస్టులను రిలీజ్ చేశారు. మరో 18,364 మంది పేపర్లను ఇన్ వ్యాలిడ్ కింద ప్రకటించారు. మూడు పేపర్లకు సంబంధించిన ఫైనల్ కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టారు. ఇవి వెబ్సైట్లో ఏప్రిల్12 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, డేటాఫ్ బర్త్ వివరాలతో ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లను పొందవచ్చని వెల్లడించారు. జనరల్ ర్యాకింగ్ లిస్టు ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 040-– 23542185 లేదా 040 – -23542187కు కాల్ చేయొచ్చని, helpdesk@tspsc.gov.in మెయిల్ కూడా చేయొచ్చని అధికారులు సూచించారు.
అబ్బాయిల హవా
గ్రూప్ 3 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో కేవలం ఒక్కరు మాత్రమే అమ్మాయి ఉన్నారు. టాప్ 50లో నలుగురు ఉండగా, టాప్ 100లో 12 మంది మాత్రమే అమ్మాయిలున్నారు. ఇటీవల రిలీజైన గ్రూప్ 2లోనూ అబ్బాయిలే ఎక్కువ మంది టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, గ్రూప్ 3 పరీక్షల్లో 450 మార్కులకు అత్యధికంగా జోన్ 3కి చెందిన అభ్యర్థి 339.239 మార్కులు సాధించారు. కాగా, టాప్ టెన్ ర్యాంకుల్లో ఆరుగురు ఓసీలు, నలుగురు బీసీలున్నారు. అయితే, టాప్ వంద ర్యాంకుల్లో ఎస్టీ అభ్యర్థులు ముగ్గురు ఉండగా, ఎస్సీ అభ్యర్థులు ఒక్కరు కూడా లేరు.
పాపన్న పేట, వెలుగు: గ్రూప్ -3 స్టేట్ టాపర్‌గా మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి నిలిచారు. 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ -2లోనూ స్టేట్ 18వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి.. ఇంజినీరింగ్ చేసి ప్రస్తుతం హవేలీ ఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. మెదక్ కలెక్టర్ ఆఫీస్‌లో డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నారు.
టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలు
ర్యాంక్ హాల్ టికెట్ మార్కులు కమ్యూనిటీ
1 2295819138 339.239 ఓసీ
2 2291113046 331.299 ఓసీ
3 2295404444 330.427 ఓసీ
4 2291818231 329.279 ఓసీ
5 2295819112 327.245 బీసీ-డీ
6 2293324675 326.272 బీసీ-బీ
7 2296409046 326.225 బీసీ-బీ
8 2295818625 325.157 ఓసీ
9 2296409077 323.184 బీసీ-బీ
10 2292807296 323.157 ఓసీ