టీఎస్​పీఎస్సీ సైలెంట్..పేపర్ లీక్ తర్వాత సప్పుడు చేయని కమిషన్

టీఎస్​పీఎస్సీ సైలెంట్..పేపర్ లీక్ తర్వాత సప్పుడు చేయని కమిషన్

హైదరాబాద్, వెలుగు:  నోటిఫికేషన్లు, పరీక్షలతో హడావుడిగా ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్​ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. కేసులు, విచారణ, ఆందోళనలతో కమిషన్​ పేరు మార్మోగిపోతోంది. క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం బయటికొచ్చిన తర్వాత సంస్కరణలంటూ హడావుడి చేసిన అధికారులు, ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. మరోపక్క అభ్యర్థులకు కమిషన్ పై నమ్మకాన్ని కల్పించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. 

ఒక్కసారే మీడియా ముందుకు.. 

గతేడాది టీఎస్​పీఎస్సీ ఏకంగా 26 జాబ్​ నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. వీటిలో ఏడు నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి. చాలా నోటిఫికేషన్ల ఎగ్జామ్స్ డేట్లు ప్రకటించగా, మరో నాలుగైదు నోటిఫికేషన్ల అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి  ఉంది. అభ్యర్థులంతా సీరియస్​గా ప్రిపేర్​ అవుతుండగా, సడెన్​గా టీఎస్​పీఎస్సీ సిస్టమ్ హ్యాక్ అంటూ రెండు పరీక్షలను వాయిదా వేశారు. అంతా సిస్టమ్ హ్యాక్ అని భావించగా, పేపర్ లీక్ జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.

దీంతో అప్పటివరకు నిర్వహించిన గ్రూప్1 ప్రిలిమ్స్, డీఏఓ, ఏఈ, ఏఈఈ పరీక్షలను టీఎస్​ పీఎస్సీ రద్దు చేసింది. మార్చిలో జరగాల్సి ఉన్న పలు పరీక్షలను కూడా తర్వాత వాయిదా వేసింది. ఏప్రిల్ లో జరిగే మరో పరీక్షకు రీషెడ్యూల్ ఇచ్చింది. ఈ లీకేజీ ఎపిసోడ్​లో ఒక్కసారి మాత్రమే టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్​ రెడ్డి, ఇతర సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత కమిషన్​పై అనేక ఆరోపణలు వచ్చినా, కనీసం  స్పందించట్లేదు.  

వారి ఫోన్ల డేటాను సేకరించాలని.. 

రాష్ట్రంలో నెల రోజుల నుంచి టీఎస్​ పీఎస్సీ పేపర్ లీకేజీపైనే చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మరోపక్క సిట్ విచారణ జరుగుతోంది. ఈ లీకేజీ ఇష్యూలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్​ పీఏ ప్రవీణ్ కుమార్ కీలక నిందితుడు.  మొత్తంగా నలుగురు టీఎస్​ పీఎస్సీ ఉద్యోగులు ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

అయినా ఇంతవరకూ దీనిపై ఇంటర్నల్ విచారణ చేయలేదని తెలుస్తోంది. కనీసం ఈ ఘటనలో ఏ ఒక్క అధికారిపైనా చర్య తీసుకోలేదు. ప్రస్తుతం చైర్మన్ పీఏతో సహా, మిగిలిన సభ్యుల పీఏలపై ఓ కన్నేసి పెట్టాలనే డిమాండ్లు పోటీ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి వస్తున్నాయి. వారి ఫోన్ల డేటాను సేకరించాలని అడుగుతున్నారు.  

పీఆర్ఓ కూడా దిక్కులేడు.. 

టీఎస్​పీఎస్సీకి కనీసం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్​ఓ)​ కూడా లేడు. దీనికి ఒక పోస్టు మంజూరై ఉన్నా..  భర్తీ చేసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. కనీసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో కూడా పీఆర్ఓను  పెట్టుకోలేకపోయారు. ప్రస్తుతం కమిషన్ చైర్మన్​ జనార్దన్ రెడ్డి పీఏగా పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్రెటరీ కేఎం మల్లికార్జున్.. కేవలం మీడియా గ్రూపులో నోటిఫికేషన్ల వివరాలను పోస్టు చేస్తున్నారు.  దీంతో ఏమైనా కమిషన్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా అభ్యర్థులకు కష్టంగా మారింది.  

సంస్కరణలపై మళ్లీ చర్చే లేదు..

పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్​ పీఎస్సీలో సంస్కరణలు తీసుకొస్తామంటూ కమిషన్ పెద్దలు మీడియాకు లీకులు ఇచ్చారు.  దీనిపై తీవ్రంగా చర్చలు చేస్తున్నట్టు  వారు చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటివరకూ ఏం సంస్కరణలు చేశారనేది మాత్రం ప్రకటించలేదు.  కమిషన్​లో చర్చించిన ప్రధాన సంస్కరణలన్నీ.. స్టేట్ గవర్నమెంట్​ అనుమతులతోనే లింకై ఉన్నాయి.  

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినా.. నిధులు, నియామకాలపై రాష్ట్ర సర్కారుపైనే ఆధారపడాల్సి ఉంటుంది. సంస్కరణలపై గతంలో కూడా కమిషన్ నుంచి రాష్ట్ర సర్కారుకు విజ్ఞప్తులు వెళ్లినా ప్రభుత్వ పెద్దలు పక్కనపెట్టారు.