- మల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో
- ఒకరి నుంచి మరొకరికి అమ్మకం
- వందల మంది చేతులు మారిన ఏఈ పేపర్!
- ఒక్కో అభ్యర్థి దగ్గర రూ.10 లక్షలకు ధాక్యా గ్యాంగ్ డీల్
- పెట్టిన డబ్బులు రాబట్టుకునేందుకు
- ఇంకొందరికి అమ్ముకున్న అభ్యర్థులు
- సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
- 14కు చేరిన నిందితుల సంఖ్య.. త్వరలో మరిన్ని అరెస్టులు
- గ్రూప్ 1 పేపర్ లీకేజీపై రోజూ 15 మంది విచారణ
హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్1 పేపర్ లీకేజీ సక్సెస్ కావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్‌ను కూడా నిందితులు లీక్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈ పేపర్ లీకేజీ కూడా సక్సెస్ ఐతే వరుసగా అన్ని పేపర్లు లీక్ చేసేందుకు వాళ్లు స్కెచ్ వేసినట్లు వెల్లడైంది. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ తరహాలో పేపర్ల లీకేజీ తతంగం సాగినట్లు ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. లీకైన ఏఈ పేపర్ ఒకరి నుంచి మరొకరికి చైన్ సిస్టమ్‌తో చేతులు మారినట్లు గుర్తించారు. లీకైన పేపర్‌తో పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు అదే పేపర్‌ను మరికొందరికి అమ్మినట్లు తెలుస్తున్నది. తాము కొన్న రేటు కంటే మరింత ఎక్కువ రేటుకు అమ్మినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో అభ్యర్థికి ప్రధాన నిందితులు రూ. 10 లక్షలకు పేపర్‌ను అమ్మినట్లు సిట్ ఆధారాలు సేకరించింది.
అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు తీసుకొని, ఎగ్జామ్ రాసిన తర్వాత మరో ఐదు లక్షలను నిందితులు తీసుకున్నట్లు తెలుస్తున్నది. అలా పేపర్ కొన్నవాళ్లు మిగతావాళ్లకూ మరింత కమీషన్‌కు పేపర్ అమ్మినట్లు సమాచారం. నీలేశ్, గోపాల్ అనే ఇద్దరికే కాకుండా ఇంకా ఎంతో మంది అభ్యర్థుల చేతుల్లోకి ఏఈ పేపర్ వెళ్లినట్లు సిట్ భావిస్తున్నది. ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు 14 మందిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేసింది. త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఉపాధి పథకంలోని యువకులే టార్గెట్‌గా..!
వికారాబాద్ జిల్లా డీఆర్‌డీఏలో ధాక్యానాయక్ పనిచేయడంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారితో అతడికి మంచి పరిచయాలున్నాయి. తమ వద్దకు ఏఈ పేపర్ రావడంతో దాన్ని మరికొందరికి అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందులో భాగంగా ధాక్యానాయక్, ఆయన బావమరిది రాజేశ్వర్.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న యువకుల్లో ఏఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ల గురించి ఆరా తీశారు. నవాబ్‌పేట్‌లో పనిచేసే ప్రశాంత్‌రెడ్డికి రూ. 7.5 లక్షలకు ఏఈ ప్రశ్నపత్రాన్ని అమ్మారు. ధాక్యానాయక్ ఇచ్చిన సమాచారంతో శుక్రవారం ప్రశాంత్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ప్రశాంత్ రెడ్డి నుంచి ఇంకా ఎవరికైనా ఏఈ పేపర్ చేరిందా? అనే వివరాలను సేకరిస్తున్నది. రేణుక స్వగ్రామం గండీడ్ మండలం పంచాకుల సమీపంలోని సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య అనే కాంట్రాక్టర్ ద్వారా కూడా పేపర్ లీక్ అయినట్లు సిట్ గుర్తించింది. ఉపాధి హామీ పథకంలో పనిచేసే షాద్‌నగర్ నేరెళ్ల చెరువు గ్రామానికి చెందిన రాజేంద్రకుమార్ ఏఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాడని, అతడు తనకు పరిచయమని ధాక్యాకు తిరుపతయ్య చెప్పాడు. దీంతో ఏఈ పేపర్ గురించి ఇద్దరూ కలిసి రాజేంద్రకుమార్‌కు తెలిపారు. రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా రూ.5 లక్షలు, పరీక్ష రాసిన తర్వాత మిగితా రూ.5 లక్షలు ఇచ్చే విధంగా రాజేంద్రకుమార్‌తో మాట్లాడుకున్నారు. రాజేంద్రకుమార్ కుటుంబం రూ.5 లక్షలు అప్పు చేసి ధాక్యాకు ఇచ్చినట్లు సమాచారం. తాము చెల్లించిన డబ్బు తిరిగి సంపాదించేందుకు పేపర్‌ను రాజేంద్రకుమార్ మరికొంత మందికి చేరవేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. రాజేంద్రకుమార్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. తిరుపతయ్య కూడా తమ దగ్గరకు వచ్చిన పేపర్‌ను మరికొందరికి అమ్మినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎగ్జామ్‌కు రెండురోజుల ముందు పేపర్
ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌కు ఏఈ పరీక్షకు రెండు రోజుల ముందు ధాక్యానాయక్, రేణుకదంపతుల ద్వారా పేపర్ చేరినట్లు తెలుస్తున్నది. ఇలా పేపర్ కొనోళ్లు కూడా తమకు తెలిసిన వారికి వరుసగా అమ్ముతూ పోయినట్లు సిట్ అనుమానిస్తున్నది. తాము చెల్లించిన డబ్బుకు అదనంగా కొంత లాభం వచ్చేలా పేపర్ సేల్ చేసినట్టు తెలుస్తున్నది. ఏఈ పేపర్ లీకేజీ ద్వారా ధాక్యానాయక్‌కు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల చొప్పున అందినట్లు సిట్ ఆధారాలు సేకరించింది.
రేణుక, ధాక్యానాయక్ విప్పిన గుట్టు
కేసు దర్యాప్తులో భాగంగా గత వారం ఆరు రోజుల పాటు నిందితులను సిట్ కస్టడీకి తీసుకుని విచారించింది. కస్టడీ విచారణలో ప్రవీణ్, రేణుక, ధాక్యా నాయక్ కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. జగిత్యాల, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్ల అభ్యర్థులు ఏఈ పేపర్‌ను కొన్నట్లు సిట్ అనుమానిస్తున్నది. మల్టీలెవల్ మార్కెటింగ్ సిస్టమ్‌లో పేపర్ అమ్మకం జరిగినట్లు గుర్తించింది. ఇందులో రేణుక భర్త ధాక్యానాయక్, ఆమె తమ్ముడు రాజేశ్వర్ కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. ప్రవీణ్ నుంచి రేణుక, ఆమె నుంచి ధాక్యా నాయక్‌కు పేపర్ చేరింది. ఏఈ పేపర్ తమ చేతిలోకి రావడంతో భారీగా డబ్బు సంపాదించుకోవాలని తన బావమరిది రాజేశ్వర్‌తో కలిసి ధాక్యానాయక్ స్కెచ్ వేసినట్లు సిట్ గుర్తించింది.
గ్రూప్-1 లీకేజీలపై కొనసాగుతున్న విచారణ
ఏఈ పేపర్‌తో పాటు గ్రూప్-1 పేపర్ లీకేజీపై సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తున్నది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా 121 మందికి 100కుపైగా మార్కులు వచ్చాయి. అందులో శనివారం నాటికి 42 మందిని సిట్ విచారించింది. మిగిలిన 80 మందిలో ప్రతి రోజూ 15 మందిని విచారిస్తున్నది. ఆదివారం కూడా పలువురు అభ్యర్థులను ప్రశ్నించింది. వారి విద్యార్హతలు, గతంలో రాసిన పోటీ పరీక్షలు, ట్రైనింగ్ సహా వారికి ఉన్న నైపుణ్యంపై వివరాలు సేకరించింది. లీకేజీతో సంబంధం లేని వారికి క్లీచ్ చిట్ ఇచ్చి పంపించింది. గ్రూప్1 పేపర్ లీకేజీతో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న టీఎస్‌పీఎస్సీ ఎంప్లాయ్ షమీమ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రమేశ్, మాజీ టెక్నీషియన్ సురేశ్‌ను కస్టడీకి తీసుకుని విచారించనుంది. ఈ ముగ్గురి కస్టడీపై సోమవారం కోర్టులో విచారణ జరుగనుంది. వీరితో పాటు శనివారం అరెస్ట్ చేసిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌ను కోర్టులో ప్రొడ్యూస్ చేసి కస్టడీ కోరనుంది.