గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు అప్లై చేయకున్నా.. తనకు హాల్ టికెట్ వచ్చిందని ఓ యువతి ఆరోపించిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్పందించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన జక్కుల సుచిత్ర అనే యువతి.. తనకు గ్రూప్ 1 హాల్ టికెట్ వచ్చిందని ఆరోపించిన విషయం తెలిసిందే. తాను గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కు మాత్రమే అప్లై చేశానని సుచిత్ర వెల్లడించింది.
అయితే.. సుచిత్ర వ్యాఖ్యలపై టీఎస్‌పీఎస్సీ తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో కమిషన్ వివరణ ఇచ్చింది. సుచిత్ర గ్రూప్ 1 ప్రిలిమ్స్ కే అప్లై చేసుకుందని తాజాగా టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ఆదివారం (జూన్ 11న) రోజు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సుచిత్ర హాల్ టికెట్ పొందారని కూడా పేర్కొంది. సుచిత్ర గ్రూప్ 1 ప్రిలిమ్స్ దరఖాస్తు చేసుకోనప్పటికీ...గ్రూప్- 3కి మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-3, 4 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తే గ్రూప్-1 హాల్ టికెట్ ఇచ్చారనడం అబద్ధం అని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
జక్కుల సుచిత్ర D/o.జక్కుల శ్రీధర్ TSPSC ID: TS1201206420తో గత సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారని కమిషన్ స్పష్టం చేసింది. నిజామాబాద్ AHMV జూనియర్ కళాశాలలో జరిగిన పరీక్షకు హాజరైనట్లు తమ రికార్డులో ఉందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వారందరూ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ నుండి మెసేజ్ లు వెళ్లినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం (జూన్ 11న) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.