
టీఎస్పీఎస్పీ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 రకాల సబ్జెక్టులకు సంబంధించి 1392 జేఎల్ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభకానున్నది. వచ్చే ఏడాది జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ లేదా జులైలో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అర్హత, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్‌లో మార్పులను తెలుసుకుందాం.
పోస్టులు: జూనియర్ లెక్చరర్ 1392 (మల్టీజోనల్–1లో 724, మల్టీజోనల్–2లో 668)
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్) లేదా బీఏ హానర్స్, బీఎస్సీ హానర్స్, బీకాం హానర్స్ 50శాతం మార్కులతో పాసైన వారు అర్హులు. ఇందుకు సంబంధించిన సమాన అర్హత కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జూనియర్ లెక్చరర్స్ సివిక్స్‌కు అప్లై చేసేవారు పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిస్టెన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదివిన వారూ అర్హులే. అయితే, ఆ యూనివర్సిటీ యూజీసీ/ ఏఐసీటీ/ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో గుర్తింపు పొంది ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. నెగెటివ్ మార్కింగ్ లేదు. ఓసీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ 40శాతం, బీసీ 35శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు 30శాతం కంటే తక్కువ కాకుండా మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: జూనియర్ లెక్చరర్ ఎంపికకు నిర్వహించే పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్ లో 150 మార్కులకు150 ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2 సంబంధిత సబ్జెక్ట్‌లో 150 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటుంది. ఈ రెండు పరీక్షలు మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఎగ్జామ్ జూన్ లేదా జులైలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది.
సిలబస్ : కరెంట్ అఫైర్స్ (ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం), అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు, విపత్తుల నిర్వహణ, భారతదేశ, తెలంగాణ ఆర్థిక, సామాజికాభివృద్ధి, భారతదేశ భౌగోళిక, సాంఘిక, ఆర్థిక జాగ్రఫీ, తెలంగాణ భౌగోళిక, సాంఘిక, ఆర్థిక జాగ్రఫీ, ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, పరిపాలన, సామాజిక వెలి, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, దత్తాంశ విశ్లేషణ, బేసిక్ ఇంగ్లిష్.
సిలబస్‌లో మార్పులు
గత ఎగ్జామ్(చివరగా 2008లో జేఎల్ ఎగ్జామ్ జరిగింది)తో పోలిస్తే పేపర్–1లో స్వల్ప మార్పులు చేశారు. కొత్తగా భారతదేశ భౌతిక, సాంఘిక, ఆర్థిక భూగోళశాస్త్రం, తెలంగాణ భౌతిక, సాంఘిక, ఆర్థిక భూగోళశాస్త్రం, తెలంగాణ రాష్ట్ర జనాభాశాస్త్రం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఆధునిక భారతదేశ చరిత్ర, ముఖ్యంగా భారతదేశ జాతీయోద్యమం, సామాజిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తెలంగాణ చరిత్ర, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రోద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాలను చేర్చారు. ఈ అంశాలు తుది ఫలితాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయి. పేపర్–1లో తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారతదేశ, తెలంగాణ భూగోళశాస్త్రం అంశాలను పూర్తిస్థాయిలో చదవాల్సి ఉంటుంది. వీటి నుంచే దాదాపు 50 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారతదేశ, తెలంగాణ భూగోళశాస్త్రాలను మొదటిసారి చదివే వారికి కనీసం రెండు నెలలు సమయం పడుతుంది. గతంలో కొంత చదివిన వారికి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని సమయం సద్వినియోగం చేసుకోవాలి. చరిత్ర విషయానికి వస్తే గత సిలబస్‌లో భారతదేశ చరిత్ర, సాంస్కృతిక సంపద అని పేర్కొన్నారు. అంటే.. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రలను చదవాల్సి ఉండేది. కొత్త సిలబస్‌లో ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది. కాబట్టి క్రీ.శ. 1600 నుంచి 1947 వరకు చదివితే సరిపోతుంది. ముఖ్యంగా భారతదేశ జాతీయోద్యమ కాలమైన 1885 నుంచి 1947 వరకు సంపూర్ణంగా చదవాలి. ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే జూనియర్ లెక్చరర్ జనరల్ స్టడీస్ పేపర్ కఠినంగా ఉండే అవకాశం ఉంది.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్
పేపర్-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ 150 X 1 = 150
పేపర్-2 సంబంధిత సబ్జెక్ట్(పీజీ స్థాయి) 150 X 2 = 300
పీజీ స్థాయిలో ప్రశ్నలు
జేఎల్ పేపర్–2 సిలబస్ ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు, ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ చదివితే సరిపోదు. తెలుగు అకాడమీపై మాత్రమే ఆధారపడకుండా వివిధ యూనివర్సిటీల పీజీ పుస్తకాలను చదవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు. సబ్జెక్టు సంబంధిత ప్రశ్నాపత్రం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్థాయిలో ఉంటుంది. ఒక్క ప్రశ్నకు రెండు మార్కులు అంటేనే ప్రశ్నాపత్రం చాలా స్టాండర్డ్‌గా, విభిన్నంగా ఉంటుందని అర్థం.
ఉదాహరణకు భారతదేశ జాగ్రఫీని తీసుకుంటే సాధారణ జీఎస్ పేపర్‌కు జేఎల్ జనరల్ స్టడీస్ పేపర్‌కు తేడా ఉంటుంది. ఎందుకంటే సాధారణ జీఎస్‌లో భారతదేశ జాగ్రఫీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. కానీ జేఎల్ పేపర్లో డిగ్రీ స్థాయిలో చదవాలి. అదేవిధంగా కాన్సెప్ట్లపై పట్టు సాధించాలి. లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. సాధారణ జీఎస్ పేపర్లో భారతదేశ జాగ్రఫీని ఓవరాల్‌గా లేదా ముఖ్యమైన చాప్టర్ల సారాంశాలను సమకాలీన అంశాలతో జోడించి చదువుకుంటే సరిపోతుంది. జేఎల్‌లో కోర్ సబ్జెక్టును సంపూర్ణంగా చదవాల్సి ఉంటుంది. అలాగే భౌతిక భూగోళశాస్త్రం, సాంఘిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళశాస్త్రం కోణంలో చదవాలి. అట్లాస్ ఆధారంగా చదివితే జాగ్రఫీని సులభంగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఇంగ్లిష్‌లో చదవండి
జూనియర్ లెక్చరర్ పేపర్–1 జనరల్ స్టడీస్ ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. పేపర్–2కు వచ్చేసరికి లాంగ్వేజెస్ పేపర్లు అంటే సంస్కృతం, ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లిష్, ఫ్రెంచ్ ఆయా భాషల్లో ఇస్తారు. కానీ, మిగతా సబ్జెక్టులు ఎకానమీ, సివిక్స్, కామర్స్.. ఏదైనాసరే క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. మరేతర భాషల్లో ఇవ్వరు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టును ఇంగ్లిష్‌లోనే చదవడం ఉత్తమం. - పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీస్ IAS స్టడీ సర్కిల్