హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గ్రామాల్లో విలేజ్ బస్ ఆఫీసర్లను నియమిస్తున్నామని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో 1,730 నియమించామని ఆయన చెప్పారు. బుధవారం బస్ భవన్ లో విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించిన ఆయన.. అనంతరం జిల్లాల నుంచి వచ్చిన ఆఫీసర్లతో సమావేశమయ్యారు.
పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం తదితర అంశాలకు బస్సులను వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు పెంచాలని కోరారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని సూచించారు. వ్యవస్థలో మంచిగా పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు.