- గ్రేటర్ హైదరాబాద్ జోన్ మొత్తానికి ఒకే సెక్షన్
- ఈ నెల 6న ఉత్తర్వులు ఇచ్చిన సంస్థ ఎండీ సజ్జనార్
- వీటి మూసివేతతో ఇబ్బంది పడనున్న కార్మికులు, ఉద్యోగులు
- నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ డిపోల్లో అకౌంట్స్ సెక్షన్లు మూత పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో అకౌంట్స్ సెక్షన్లను క్లోజ్ చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 6న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చిన ఉత్తర్వులు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్ రీజియన్ల పరిధిలో ఉన్న డిపోల్లో అకౌంట్స్ సెక్షన్లను తొలగించి జోన్ మొత్తానికి ఒకే అకౌంట్స్ సెక్షన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఎండీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో గ్రేటర్‌లో ఉన్న డిపోల్లోని అకౌంట్స్ సెక్షన్లలో సుమారు 120 మంది అధికారులు పనిచేస్తుండగా, వారిని ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయనున్నారు. ఇది పైలెట్ ప్రాజెక్టు అని అధికారులు చెబుతున్నప్పటికీ, దశల వారీగా రాష్ట్రంలోని అన్ని డిపోల్లో అమలు చేయనున్నట్లు సంస్థలో చర్చ జరుగుతోంది.
ఏంటీ అకౌంట్స్ సెక్షన్ డ్యూటీలు..
రాష్ట్రంలోని డిపోల్లో అకౌంట్స్ సెక్షన్ ఉంటే ఆయా డిపోల్లో పనిచేసే కార్మికుల వేతనాలు, డీఏ, ఇంక్రిమెంట్లు, గ్రేడ్లు, లీవ్స్ ఇతర అన్ని అంశాలతో పాటు ప్యాసింజర్, కార్గో రెవెన్యూ, లాభం, నష్టం అంతా ఈ సెక్షన్ నిర్వహిస్తుంది. చిన్న డిపోల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ ఉండగా, పెద్ద డిపోల్లో అసిస్టెంట్ మేనేజర్‌తో పాటు మొత్తం ఐదుగురు అధికారులు పనిచేస్తున్నారు. అకౌంట్స్ సెక్షన్ అంటే కేవలం రోజువారీ రెవెన్యూ, ఖర్చులను నమోదు చేయడం, బ్యాంకులో జమ చేయడం, జీతాలు, అలవెన్సుల చెల్లింపులతో పాటు ఇతర అంశాలూ ఉంటాయి. రోజువారీ రెవెన్యూ, ఖర్చులను డిపో అకౌంట్స్‌ను సూపర్ వైజర్స్ పరిశీలించి జోన్‌కు, హెడ్ ఆఫీస్‌కు పంపిస్తుంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండడంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ లు, ఉద్యోగులు అంతా తమ డిపోల్లో వివరాలు తెలుసుకుంటున్నారు. వీటిని క్లోజ్ చేస్తే ఇక నుంచి జోనల్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
గతంలో స్కామ్‌లు..
అకౌంట్స్ సెక్షన్‌లో అధికారుల కొరతతో గతంలో రాణిగంజ్, మిథానీ, హనుమకొండ డిపోల్లో రూ.కోటి అవినీతి జరిగిందని యూనియన్ నేతలు చెబుతున్నారు. డీజిల్ ఫిల్లింగ్, స్పేర్ పార్ట్స్ అంశంలో ఈ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. సిబ్బంది తక్కువ ఉండడం వల్ల ఈ స్కామ్‌లు జరిగాయని యూనియన్ నేతలు పేర్కొన్నారు. అధికారుల సంఖ్యను పెంచితే ఇలాంటివి జరగవని, ఇప్పుడు ఆఫీసర్ల సంఖ్య పెంచకుండా ఉన్న వారినే తొలగించి, అకౌంట్స్ సెక్షనే లేకుండా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
ALSO READ :లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దేవెగౌడ
ఆడిట్ ప్రమాణాలు దెబ్బతింటయ్..
కార్పొరేట్ కంపెనీల్లో అమలు చేసే నిర్ణయాలు ఆర్టీసీలో సెట్ కావు. డిపో, రీజియన్, జోన్, హెడ్ ఆఫీస్ నుంచి ఆడిట్ ఉంటుంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అధికారులు ఆడిట్ చేస్తుంటారు. సెంట్రలైజ్డ్ చేయడం వల్ల ఆడిట్‌కు ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో పనిచేసే కార్మికులు తమ వేతనాలు, ఇంక్రిమెంట్లు తదితర సమాచారం తెలుసుకోవాలంటే జోన్ ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు చేస్తాం.
‑ థామస్ రెడ్డి, టీఎంయూ జనరల్ సెక్రటరీ
ఈ నిర్ణయం సరికాదు..
డిపోల్లో ఉన్న అకౌంట్ సెక్షన్‌ను రీ షఫ్లింగ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, ఇప్పటికే ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు వినతిపత్రాలు అందజేశాం. గ్రేటర్ హైదరాబాద్ జోన్ మొత్తానికి ఒకే అకౌంట్ సెక్షన్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 6న ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. దశల వారీగా అన్ని డిపోల్లో సెక్షన్లను తొలగించే అవకాశం ఉంది.
‑ వీఎస్ రావు, జనరల్ సెక్రటరీ, ఎస్‌డబ్ల్యూఎఫ్