3 నెలలుగా ఓనర్లకు అందని బిల్లులు
20 శాతం హైర్ బస్సులు కూడా తిప్పని ఆర్టీసీ
70 కోట్ల దాకా పేరుకుపోయిన బకాయిలు
పైసల్లేవంటూ చేతులెత్తేసిన ఉన్నతాధికారులు
బండ్ల లోన్, ఈఎంఐలు కట్టలేక ఓనర్ల అవస్థలు
డ్రైవర్ల జీతాలకూ పైసల్లేవని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో అద్దె బస్సులకు చెల్లించేందుకు పైసల్లేవ్. కరోనా ఎఫెక్ట్ వల్ల ఓనర్లకు మూడు నెలలుగా ఆర్టీసీ డబ్బులు చెల్లించడం లేదు. ఆర్టీసీ నుంచి బకాయిలు రాకపోవడంతో బండ్ల ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, కనీసం డ్రైవర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హైర్ బస్సుల ఓనర్లకు ఆర్టీసీ ఇవ్వాల్సిన బకాయిలు రూ. 70 కోట్ల దాకా పేరుకుపోయాయని చెప్తున్నారు. కరోనా వల్ల ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో అద్దె బస్సులను నడపడం కూడా ఆర్టీసీ తగ్గించిందని అంటున్నారు.
మూడు నెలలుగా బిల్లులొస్తలే..
ప్రస్తుతం ఆర్టీసీలో 6,500 బస్సులు నడపడానికి సిద్ధంగా ఉండగా, 3,500 వరకు మాత్రమే నడుపుతున్నారు. ఆర్టీసీలో 3,300 అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సులకు కిలోమీటర్ లెక్కన రేటు కట్టిస్తరు. ఒక్కో బస్సుకు నెలకు రూ.లక్ష వరకు బిల్లు అవుతుంది. నెలనెలా అద్దె బస్సుల ఓనర్లకు డబ్బులు ఇస్తరు. కానీ మార్చి నుంచి డబ్బులు ఆగిపోయాయి. మార్చిలో బస్సులు నడవలేదు అనుకున్నా.. మిగతా మూడు నెలల బకాయిలు అయినా చెల్లించాల్సి ఉంది. కానీ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో, అధికారులు పైసల్లేవని చేతులెత్తేస్తున్నారు.
లోన్లు కట్టలేక.. జీతాలియ్యలేక..
“ఆర్టీసీ దగ్గర డబ్బుల్లేవ్.. వచ్చిన డబ్బులు డీజిల్ కు కూడా సరిపోతలేవు. సర్కార్ ఆదుకుంటెనే ఇస్తాం’’ అని ఉన్నతాధికారులు అంటున్నారని హైర్ బస్సుల ఓనర్లు చెప్తున్నారు. బస్సుకు కండక్టర్ ను ఆర్టీసీనే సమకూరుస్తుండగా, డ్రైవర్ ను మాత్రం ఓనర్లే తెచ్చుకోవాలి. దీంతో మూడు నెలలుగా డ్రైవర్లకు జీతాలు ఇయ్యలేక, వారికి సమాధానం చెప్పలేక ఓనర్లు అవస్థలు పడుతున్నారు. అద్దె బస్సుల ఓనర్లలో 80–90% మంది లోన్లు తీసుకుని బండ్లను కొన్నారు. ఆర్టీసీ నుంచి నెలనెలా బిల్లులు వస్తాయని, రెగ్యులర్గా ఈఎంఐలు కడతామని భావించారు. ఇప్పుడు బిల్లులు ఆగిపోవడంతో మూడు నెలలుగా ఈఎంఐలు కట్టలేదని, ఫైనాన్షియర్లు ఒత్తిడి తెస్తున్నారని ఓనర్లు వాపోతున్నారు.
వారానికో ట్రిప్ కూడా ఇస్తలేరు
కరోనా ఎఫెక్ట్ వల్ల బస్సుల్లో ప్రయాణాలకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో ఆర్టీసీ తక్కువ బస్సులను నడుపుతోంది. దీంతో అద్దె బస్సులకు చాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్లు ఖాళీగా ఉంటున్నారని చెప్పి, 10 నుంచి 20 శాతం బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో వారానికో ట్రిప్ కూడా రావడం లేదని అద్దె బస్సుల ఓనర్లు అంటున్నారు.
డబ్బులున్నా బిల్లులిస్తలె
ఆర్టీసీ నుంచి అద్దె బస్సులకు మూడు నెలలుగా డబ్బులు రావడం లేదు. బిల్లులు రాకపోవడంతో లోన్లు కట్టలేకపోతున్నం. డ్రైవర్లకు జీతాలిచ్చేందుకు కూడా పైసల్లేవు. ఆర్టీసీ ఉన్నతాధికారులను అడిగితే డబ్బులు లేవంటున్నారు. ఈ మధ్య తెచ్చిన రూ. 600 కోట్లు ఉన్నా ఇస్తలేరు. ఆక్యుపెన్సీ లేకపోవడంతో అద్దె బస్సుల్లో 20 శాతం కూడా నడపడం లేదు. ఆగిన బస్సులకు ఇన్సూరెన్స్ ఇయ్యాలి. మొత్తం బస్సులు తిప్పేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– లక్కం ప్రభాకర్, హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు