- ఇయ్యాల బస్ భవన్ ముట్టడికి సిద్ధమైన కొన్ని ఆర్టీసీ యూనియన్లు
- 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ కు పిలుపు
- ఆందోళనలు వద్దు.. చర్చలకు రండి: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆర్టీసీ యూనియన్లు, ఆటో డ్రైవర్లు నిరసనలకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని బస్ భవన్ ముట్టడికి ఆర్టీసీలోని కొన్ని యూనియన్లు సిద్ధమయ్యాయి. ఈ ఆందోళనకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో హైకోర్టు నుంచి పర్మిషన్తెచ్చుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తమ ప్రధాన డిమాండ్ గా నిరసన చేపడ్తున్నామని చెప్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత జర్నీతో తాము ఉపాధి కోల్పోతున్నామని, తమకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆటో డ్రైవర్లు ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ కు పిలుపునిచ్చారు. అయితే ఆందోళనలు వద్దని, చర్చలకు రావాల్సిందిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ యూనియన్ నేతలను, ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులను ఆహ్వానించారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో చర్చలకు రెడీగా ఉంటానని తెలిపారు.
అయితే ఆర్టీసీలోని కొన్ని యూనియన్లు చర్చలకు వెళ్తామని ప్రకటించగా, మరికొన్ని యూనియన్లు చర్చలను బహిష్కరించి బస్ భవన్ ముట్టడిని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. మరోవైపు ప్రజా పాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్ లో రవాణా శాఖ, ఆర్టీసీ ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి చీఫ్ గెస్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక్కడే ఆర్టీఏ లోగోను ఆవిష్కరించనున్నారు. అయితే ఇదే వేదికగా నిరసన తెలపాలని ఆర్టీసీలోని కొన్ని యూనియన్లు నిర్ణయించాయి. అయితే నిరసన కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఇతర యూనియన్లు పిలుపునిచ్చాయి.