ఒలెక్ట్రా గ్రీన్‌‌టెక్‌‌ నుంచి ఎలక్ట్రిక్‌‌ బస్సుల కొనుగోలు

 ఒలెక్ట్రా గ్రీన్‌‌టెక్‌‌ నుంచి ఎలక్ట్రిక్‌‌ బస్సుల కొనుగోలు

హైదరాబాద్, వెలుగు: మరో 300 ఎలక్ట్రిక్‌‌ బస్సుల కొనుగోలు కోసం టీఎస్‌‌ఆర్టీసీ ఆర్డర్‌‌ ఇచ్చింది. ఒలెక్ట్రా గ్రీన్‌‌టెక్‌‌ లిమిటెడ్‌‌ నుంచి దాదాపు రూ.500 కోట్లతో ఈ బస్సులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మేఘా గ్రూప్‌‌ కంపెనీకి చెందిన ఈవీ ట్రాన్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ (ఈటీఈవీ) టీఎస్‌‌ఆర్టీసీ నుంచి లెటర్‌‌ ఆఫ్‌‌ అవార్డ్‌‌ (ఎల్‌‌ఓఏ) అందుకున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌‌టెక్‌‌ చైర్మన్‌‌, ఎండీ కేవీ ప్రదీప్‌‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఫేమ్‌‌ 2 స్కీమ్‌‌ కింద ఈ 300 ఎలక్ట్రిక్‌‌ బస్సులను కొనుగోలు చేయనుంది. 12 ఏండ్లకు గాను ఆర్డర్ గ్రాస్‌‌ కాస్ట్‌‌ కాంట్రాక్ట్ (జీసీసీ)/అపెక్స్‌‌ పద్ధతిలో వీటిని తీసుకోనుంది. ఈవీ ట్రాన్స్‌‌ ఈ ఎలక్ట్రిక్‌‌ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌‌టెక్‌‌ నుంచి కొనుగోలు చేస్తుంది. బస్సులను 20 నెలల్లోగా ‌‌ఆర్టీసీకి అప్పగించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్‌‌ సమయంలో బస్సుల నిర్వహణ ఒలెక్ట్రా కంపెనీనే చూసుకుంటుంది. కేవీ ప్రదీప్‌‌ మాట్లాడుతూ, ఒలెక్ట్రా బస్సులు ఇప్పటికే హైదరాబాద్‌‌లో 3 ఏండ్లుగా విజయవంతంగా సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు మరో ఆర్డర్ రావటం సంతోషంగా ఉందన్నారు. బస్సులను అనుకున్న సమయానికి ఆర్టీసీకి అందజేస్తామని వెల్లడించారు.