సికింద్రాబాద్, వెలుగు: సిటీలో రద్దీగా ఉండే రూట్లలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీసులను పెంచేందుకు టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మేడ్చల్– మెహిదీపట్నం రూట్ లో 6 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను బుధవారం ప్రారంభించింది. మేడ్చల్ నుంచి మెహిదీపట్నానికి ఉదయం 6.40 గంటల నుంచి సాయంత్రం 7.20 వరకు, అలాగే మెహిదీపట్నం నుంచి మేడ్చల్ కు ఉదయం 8.20 నుంచి రాత్రి 9.05 గంటల వరకు ఈ సర్వీసులు సేవలందించనున్నాయి.
20 నిమిషాల ఫ్రీక్వెన్సీతో మొత్తం 24 ట్రిప్పులు నడపనున్నారు. ప్రయాణికులు ఈ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ఉపయోగించుకొని వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే ఆర్టీసీ తమ సేవలను మరింత విస్తరించేందుకు వెయ్యి కొత్త బస్సులను కొనేందుకు సిద్ధమవుతోంది. కొత్త బస్సుల్లో 416 ఎక్స్‌ప్రెస్, 300 పల్లె వెలుగు బస్సులు, రాజధాని, ఏసీ బస్సులు ఉండనున్నాయి. అలాగే 1,560 ఎలక్ట్రిక్ బస్సులను కూడా అద్దె ప్రాతిపదికన నడపనుంది.