కొత్తగూడెం ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్ ను ప్రయాణికులు దూషించిన ఘటనలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "టీఎస్ ఆర్టీసీ కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు.
ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం" అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
#TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023
ఇంతకీ ఏం జరిగిందంటే?
కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అయితే అప్పటిదాకా బస్ కోసం వెయిట్ చేసిన ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఆలస్యం కావడంతో అక్కడే ఉన్న ఆటోల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అక్కడకు బస్ రావడంతో ఆటోనుంచి దిగి బస్సు ఎక్కేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ కె.నాగరాజుపై దాడిచేశారు. . కండక్టర్ సరస్వతి, ప్రయాణికులు, వాహనదారులు వారించే ప్రయత్నం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఘటనపై డ్రైవర్ నాగరాజు కొత్తగూడెం డిపో మేనేజర్ బాణాల వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.