రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొలిసారిగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేపీహెచ్బీ బస్టాండ్ వద్ద 10 స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం జరిగింది. వాటిలో 4 స్లీపర్, మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ బస్సులు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ – కాకినాడ, హైదరాబాద్ – విజయవాడ మార్గాల్లో ఆర్టీసీ యాజమాన్యం ఈ బస్సులను నడపనుంది. బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, సజ్జనార్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ పాల్గొన్నారు.
బస్సు ప్రత్యేకతలు
స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతో పాటు లోయర్ లెవల్‌లో 33 సీట్లు ఉంటాయి. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయాన్ని కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి ఒక వాటర్ బాటిల్ ఉచితంగా అందజేస్తారు. ప్రయాణికుల లగేజీ లోడింగ్, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారు. బస్సుకు ముందు వెనక ఎల్‌ఈడీ బోర్డులుంటాయి. గమ్యస్థానాల వివరాలు తెలుగు, ఇంగ్లీషు భాషలో దులో కనిపిస్తాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులోనూ మూడు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.