ఆర్టీసీ నష్టాలకు కారణాలు ఇవే..

నిజాం కాలం నుంచి ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ

నిజాం కాలం నుంచి  ప్రజా రవాణా వ్యవస్థ అమల్లో ఉంది. నిజాం హయాంలో  హైదరాబాద్‌‌లో నిజాం రైల్వేస్‌‌, రోడ్‌‌ వేస్‌‌ కలిపి ఒక సంస్థగా నడిపించారు. బస్సులు స్టీమ్‌‌ ఇంజిన్‌‌తో నడిచాయి. తర్వాత సాంకేతికంగా చాలా అభివృద్ధి జరిగింది. ఈ సంస్థలో రైల్వేను, బస్సులను విడదీసి రోడ్డు ట్రాన్స్‌‌పోర్ట్ ‌ కార్పొరేషన్‌‌గా  ఏర్పాటు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను నిజాం ప్రభువు చూడడంతో ఆయన భార్య పేరులో మొదటి అక్షరం ‘జెడ్‌‌’తో ఉండడంతో ఆనాటి నుంచి సంస్థ కొనుగోలు చేసే బస్సు నెంబర్లకు ‘జెడ్’  అక్షరం పేరుతో రిజిస్ట్రేషన్‌‌ చేయిస్తున్నారు. అప్పటి నుంచి ఆర్టీసీ, క్రమశిక్షణ గల ప్రభుత్వ సంస్థగా ఎదిగింది.

ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీదే మేజర్​ రోల్​. నిజాం కాలం నుంచి తెలంగాణలో  ప్రజా రవాణా వ్యవస్థ అమల్లో ఉంది. ఆర్టీసీకి నష్టాలు రావడానికి చాలా కారణాలున్నాయి. విమానాల్లో ఉపయోగించే డీజిల్ పై రాయితీ ఇచ్చే  ప్రభుత్వాలు ఆర్డీసీ బస్సుల్లో ఉపయోగించే డీజిల్ పై రాయితీ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వమే ముందుకు రావాలి. రీయింబర్స్‌‌మెంట్‌‌ కింద  చెల్లించాల్సిన డబ్బులను ఆర్టీసీకి వెంటనే చెల్లించాలి. జీహెచ్‌‌ఎంసీ నుంచి ఇవ్వాల్సిన బకాయిలను కూడా చెల్లించే ఏర్పాట్లు చేయాలి. ఆర్టీసీకి సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని అమలు చేయాలి. కార్మికుల విషయంలో బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ముందుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థకు చెందిన 11 రీజియన్లలో 55 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం  97 డిపోల నుంచి 10,460 బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 36 లక్షల కిలోమీటర్ల దూరం బస్సులు తిరుగుతూ 97 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇంత పకడ్బందీ వ్యవస్థ గల ఆర్టీసీకి రోజుకు రూ.11 కోట్ల ఆదాయం లభిస్తుండగా, రూ.14 కోట్ల మేర ఖర్చు అవుతున్నది. ప్రతి నెలా సుమారు రూ.3 కోట్ల మేరకు  ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వమే తగు చర్యలు తీసుకుకోవాలి. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఆర్టీసీని కాపాడుకోవాలి.

డీజిల్ పై  మినహాయింపు ఏదీ ?

ఆర్టీసీ టర్నోవర్‌‌ రూ.4 వేల కోట్ల చుట్టూనే తిరుగుతోంది. ప్రజా అవసరాలకు తగ్గట్టు ఆర్టీసీ ఇంకా  ఎదగాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడం వల్ల  కూడా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫిక్స్‌‌డ్‌‌ కాస్ట్‌‌ పెరుగుతున్నందున దానికి తగ్గట్టు  టర్నోవర్‌‌ పెరగడం చాలా అవసరం. అది జరగడం లేదు. వివిధ ప్రాంతాల్లో ప్రజా రవాణా అవసరాలు 10 శాతం పెరిగినప్పటికీ ఆర్టీసీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి  అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రజా సంస్థ అయిన ఆర్టీసీ  వెహికిల్స్  వినియోగించే డీజిల్ కు  మినహాయింపు లేదు. అన్ని సంస్థలలాగానే జీఎస్‌‌టి చెల్లిస్తోంది. అదే సమయంలో విమానాలకు సరఫరా చేసే డీజిల్ కు  మాత్రం ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఆర్టీసీ వెహికిల్స్  ఉపయోగించే డీజిల్ పై  రాయితీలు, వాహనాలపై విధించే పన్ను మీద రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

క్రాస్‌‌ సబ్సిడీ చెల్లింపులో జాప్యం

హైదరాబాద్‌‌లో నడిచే సిటీ బస్సుల వల్ల ఏటా రూ.400 కోట్ల నష్టం వస్తోంది. ఈ నష్టంలో 80 శాతం క్రాస్‌‌ సబ్సిడీ కింద జీహెచ్‌‌ఎంసీ ద్వారా ఇప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత నాలుగు సంవత్సరాల్లో కేవలం రూ.380 కోట్లు చెల్లించి జీహెచ్‌‌ఎంఎస్‌‌ సంస్థ చేతులు ఎత్తేసింది. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు రూ.1470 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉండగా  ఇందులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. దేశంలోగానీ, ఇతర దేశాలలో గానీ రవాణా శాఖకు క్రాస్‌‌ సబ్సిడీ ఉంటుంది. మహారాష్ట్రలో మెట్రో, మున్సిపల్‌‌, విద్యుత్‌‌ సంస్థలన్నీ కలిపి  ఒకే గొడుగు కింద ఉండడం వల్ల రవాణా వ్యవస్థకు కలిగే నష్టాన్ని ఇతర సంస్థలు క్రాస్‌‌ సబ్సిడీ ద్వారా పూడ్చుతాయి. ఇక గ్రామీణ ప్రాంతాలలో ప్రయాణీకులు ఉన్నా లేకున్నా ఆర్టీసీ బస్సులు అన్ని గ్రామాలకు వెళ్ళాలి. గ్రామాల అభివృద్ధి ఆర్టీసీ బస్సులతోనే ముడిపడి ఉన్నందున నష్టాలు వచ్చినా బస్సులను నడపాల్సిందే. ఇలా గ్రామీణ బస్సులపై ఏడాదికి రూ.450 కోట్ల నష్టం కలుగుతోంది. దీనికి కూడా ప్రభుత్వం క్రాస్‌‌ సబ్సిడీ ఇవ్వాలి. కానీ ఆ ప్రయత్నమేమీ జరగడం లేదు. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు  ప్యాసింజర్లు ఉంటేనే నడుపుతారు. డిమాండ్‌‌ ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కానీ ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులు ఉన్నా లేకున్నా  బస్సులను నడపాల్సి ఉంటుంది. ఇలా కలిగే నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

నిపుణుల కమిటీ నివేదికపై చర్యలు తీసుకోవాలి

నేను  టీఎస్‌‌ ఆర్టీసీ చైర్మన్‌‌గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కోరిక మేరకు దేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై నిపుణులు, వివిధ సంస్థ చైర్మన్లు, ఇతర దేశాలకు సలహదారులుగా ఉన్న వారు, నిట్‌‌ పరిశోధకులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థపై వారు ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఆ కమిటీ నివేదికపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి  కేసీఆర్‌‌ వెంటనే ఆ నివేదికను పరిశీలించి ఆర్టీసీని బతికించడానికి తగిన చర్యలు చేపట్టాలి.

ఒక ఊరికి బస్సు నడిస్తే ప్రయాణ ఖర్చు రూ.10 అయితే, ఆ ఊరికి బస్సు నడవకుండా ప్రైవేటు వాహనాలు నడిస్తే  ప్రయాణ ఖర్చు రూ.40 అవుతుంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రజలపై ఇలాంటి ఆర్ధిక భారం పడకుండా ప్రజా రవాణా వ్యవస్థను ముందుకు నడిపించాలి. ప్రజా రవాణాలో ఎంతో అనుభవమున్న టీఎస్ ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో అవసరం.కార్మికులను సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబసభ్యులుగా చూసి వారితో చర్చలు జరపాలి. పోలీసుల ద్వారా బెదిరింపులు, ఉద్యోగాల్లోనుంచి తొలగిస్తామని, జైళ్ళలో వేస్తామని చేసే హెచ్చరికలు సరికాదు. బెదిరింపులతో సమస్యలు పరిష్కారం కావు. రీయింబర్స్‌‌ మెంట్‌‌ కింద, దానిపై గ్యారంటీ కింద ప్రభుత్వం రూ.530 కోట్లను ఆర్టీసీకి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల లాగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఫిట్మెంట్ వర్తింపచేయాలి. జీతాలు  కూడా పెంచాలి.

సోమారపు సత్యనా రాయణ, టీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్