ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో డోర్ డెలివరీ చేసే పవిత్ర కార్యానికి టీజీఎస్ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. తలంబ్రాలను కోరుకున్న భక్తులకు వారి ఇండ్ల వద్దే అందజేయనుంది. త‌‌‌‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌‌తో పాటు సంస్థ వెబ్‌‌సైట్ tgsrtclogistics.co.inలో  రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు సంస్థ డోర్​ డెలివరీ చేస్తుందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌‌లోని బస్‌‌ భవన్‌‌లో సోమవారం సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌‌ పోస్టర్‌‌ను టీజీఎస్‌‌ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్ లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్‌‌ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి. రవిందర్, ఈడీ మునిశేఖ‌‌ర్, సీటీఎం( కమర్షియల్) శ్రీధర్ పాల్గొన్నారు.