మేడారం జాతరకు 6 వేల బస్సులు ..  30ప్రత్యేక రైళ్లు

మేడారం జాతరకు 6 వేల బస్సులు ..  30ప్రత్యేక రైళ్లు
  • జాతరను పర్యవేక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్‌‌ల బృందం నియామకం

హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం సెక్రటేరియేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ.. ఈ నెల 22న జాతర ప్రారంభం కానుండగా, అంతకంటే ముందే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు.

జాతర ప్రారంభమయ్యాక భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 4,800 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6 వేల బస్సులను మేడారానికి నడుపుతున్నామని, 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 26 వరకు బస్సులను నడుపుతున్నామని, ఇందు కోసం దాదాపు 9 వేల మంది బస్ డ్రైవర్లను నియమించామని వివరించారు. 

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..

జాతరలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా 4 వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు. మేడారాన్ని మొత్తం 8 జోన్లుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 5,600 మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు వెయ్యి మందిని నియమించామని తెలిపారు.

30ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: మేడారం జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 30 జన్​సాధారణ్​ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల  21 నుంచి 24 వరకు ట్రైన్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇవి సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ మొదలైన ప్రాంతాల నుంచి నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటాయని వివరించారు.