-
కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్, పువ్వాడ చర్చలు
-
ఈసీకి లేఖ రాసిన రవాణా శాఖ సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తున్నది. కార్మికుల 2017 పీఆర్సీ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని శనివారం ఈసీ ఈవోకు రవాణా శాఖ సెక్రటరీ శ్రీనివాస రాజు లేఖ రాశారు. ఈసీ నుంచి అనుమతి రాగానే పీఆర్సీని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి శనివారం పలు దఫాల చర్చలు జరిగాయి.
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) జనరల్ సెక్రటరీ థామస్‌రెడ్డి, కమలాకర్ గౌడ్, యాదయ్య మంత్రి హరీశ్‌రావును కలిసి పీఆర్సీ ఇవ్వాలని, యూనియన్లు పునరుద్ధరించాలని కోరారు. కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వివరించారు. మంత్రి హరీశ్‌రావు ప్రగతి భవన్ కు వెళ్లి మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డితో కలిసి సీఎంతో చర్చించినట్లు థామస్ రెడ్డి తెలిపారు.
యూనియన్ నేతలను మంత్రులు ప్రగతి భవన్ కు పిలిచి, పీఆర్సీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. వెంటనే అనుమతివ్వాలని ఈసీకి లేఖ రాయాలని ఆర్టీసీ ఎండీని సీఎం ఆదేశించారు. యూనియన్లు కూడా పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.