తెలంగాణ గోవిందం : ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు తిరుమలలో ప్రత్యేక దర్శనం

తెలంగాణ గోవిందం : ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు తిరుమలలో ప్రత్యేక దర్శనం

తిరుమల  శ్రీవారి వీఐపీ దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ.  సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒక ప్రజాప్రతినిధికి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతి.. అలాగే  ఒక సిఫార్సు లేఖపై 6 మందికి వీఐపీ దర్శన అవకాశం ఉంటుంది. మార్చి 24 నుంచి  ఈ విధానం అమలు చేయనుంది టీటీడీ. 

వీఐపీ బ్రేక్ దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను ఆది, సోమ వారాల్లో మాత్రమే స్వీకరించనుంది టీటీడీ. VIP బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలపై ప్రతి సోమ, మంగళవారం శ్రీవారి దర్శనం ఉండనుంది. బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను ఒక రోజు ముందుగానే తిరుమల కొండపైనే ఉన్న టీటీడీ కార్యాలయం కౌంటర్లలో ఇవ్వాల్సి ఉంటుంది. 

అదే విధంగా రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించనుంది టీటీడీ. అదే రోజు శ్రీవారి దర్శనం భాగ్యం ఉండనుంది. 

తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టీటీడి ఈ మేరకు నిర్ణయించింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరింది.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కల్పించాలన్న డిమాండ్లు కొంత కాలంగా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నది.