తిరుమల బాధితులకు  క్షమాపణ చెప్పాల్సిందే : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • టీటీడీ చైర్మన్‌‌, ఈవోపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: తిరుమల తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.  ఈ వ్యవహారంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని టీటీడీ చైర్మన్, ఈవోలను డిమాండ్ చేశారు. శుక్రవారం పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. బాధితుల వద్దకు వెళ్తే వారి బాధ అర్థమవుతోందంటూ టీటీడీ బోర్డ్ చైర్మన్, ఈవోలతోపాటు అధికారులకు సూచించారు. బోర్డు తప్పులకు సంక్రాంతి సంబురాలు చేసుకోవడం కూడా ఆపేశామన్నారు. “ ఇలాంటి దుర్ఘటన జరిగినపుడు ఎవరో ఒకరి మీద మొత్తం నెపం నెట్టేసి తప్పించుకునే వాడిని కాదు.

ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిన స్థానంలో ఉన్నాను. కాబట్టే హిందుత్వం ఆచరించే శ్రీవారి భక్తులంతా ఈ దుర్ఘటన విషయంలో క్షమించాలని వేడుకున్నాను. తిరుపతి తొక్కిసలాట విషయంలో టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, పాలక మండలి సభ్యులు కూడా ప్రజలకు బేషరతుగా క్షమాపణ కోరాల్సిందే. కీలకమైన సమయంలో బేషజాలకు పోకుండా ప్రజలను క్షమాపణ అడిగితే తప్పేం లేదు. నామోషీ పడాల్సిన అవసరం లేదు. క్షమాపణలు చెప్పడం వల్ల ప్రాణాలు తిరిగి రాకున్నా, ప్రజల ముందు జరిగిన తప్పుకు బాధ్యత తీసుకోవడం హుందాతనమే అనిపించుకుంటుంది ” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

బోర్డు తప్పేం లేదు..అయినా క్షమాపణ కోరుతున్నం: బీఆర్ నాయుడు

తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.  ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎంతో బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుమలలో బోర్డు అత్యవసర మీటింగ్ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు భక్తులకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించారు. అలాగే కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు పాలకమండలి నిర్ణయించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన 21 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. బాధితుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు.