తిరుమలకు నడకమార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర ఇస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జంతువులు దాడి చేస్తే కర్రతో రక్షణ పొందాలని.. వాటిని కొట్టాలన్నారు. చేతిలో కర్ర ఉంటే జంతువులు భయపడతాయని.. ఆత్మ రక్షణ కోసం.. అలిపిరి మార్గం నుంచి తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి ఓ కర్రను ఇస్తామని సంచలన ప్రకటన చేశారాయన. ఇక మధ్యాహ్నం ఒంటిగంట వరకే పిల్లలకు నడకదారిలో అనుమతిస్తామని.. మధ్యాహ్నం 2 తర్వాత నడకదారిలో పిల్లలకు పర్మిషన్ ఉండదని స్పష్టం చేశారాయన.
నడకదారిలో వైల్డ్ లైఫ్ ఔట్ పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. వన్య ప్రాణులకు భక్తులు ఆహారం పెట్టకూడదని.. భక్తులకు సూచించారాయన. భక్తుల భద్రత కోసం ఎంతయినా ఖర్చు చేస్తామని తెలిపారు. నడకదారిలో హోటల్ నిర్వహకులు చెత్తవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశిత సమయాల్లోనే కొండపైకి టూ వీలర్ల అనుమతి ఉంటుందని వెల్లడించారాయన. సర్వదర్శనం భక్తులు నడిచే వెళ్లాలనే నిబంధనను తొలగిస్తున్నామన్నారు. భద్రతపై భక్తులకు అవగాహన కల్పిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు.
భక్తుల భద్రతకు ఫారెస్ట్ సిబ్బందిని సక్యూరిటీగా నియమిస్తామని.. భద్రత కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నడకదారిలో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని టీటీడీ చైర్మన్ సూచించారు.