అమరావతి: తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. 'తిరుమల రాజకీయ వేదిక కాదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశించాం. తిరుమల పవిత్ర క్షేత్రం. కొండపై రాజకీయాలు ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకుంటామని గతంలోనే హెచ్చరించాం" అని బీఆర్ నాయుడు తెలిపారు.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనకడుగు వేయకూడదని పాలకమండలి తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశిస్తున్నామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.