తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్
  • ఈ నెల 24 నుంచి లెటర్లు అంగీకరిస్తామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ప్రకటించింది. ఇది ఈ నెల 24 నుంచి అమలులోకి వస్తుందని సోమవారం వెల్లడించింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 

సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారాల్లో మాత్రమే తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాల్లో మాత్రమే తీసుకుంటామని ప్రకటించింది. 

రూ. 300 దర్శనం టికెట్ల లేఖలపై ఏరోజుకా రోజు దర్శనం ఉంటుంది. నిర్దేశిత రోజుల్లో ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి ఒక లేఖ మాత్రమే తీసుకుంటామని.. ఒక  లేఖలో ఆరుగురు భక్తులకే దర్శనం ఉంటుందని టీటీడీ పేర్కొంది. కాగా.. ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆదివారం సిఫార్సు లేఖలను స్వీకరిస్తుండగా ఇందులో మార్పులు చేశారు. 

ఇకపై ఈ లేఖలను శనివారం (ఆదివారం దర్శనం కోసం) స్వీకరిస్తామని టీటీడీ ప్రకటించింది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకొని, సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు  టీటీడీ తెలిపింది.

 తిరుమల దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అంగీకరించాలని ఈ నెల 12న ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ దేవాదాయ శాఖ  మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. టీటీడీ తాజా నిర్ణయంపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలియజేశారు.